సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం
హరీష్‌రావుకు మంత్రి పొన్నం సవాల్
హుస్నాబాద్, జూన్12: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపారు.
శాఖల నిర్వహణలో రాజకీయ జోక్యానికి తావులేకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. హరీష్ రావు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మాదిరిగానే ఇప్పుడు కూడా జరుగుతోందన్న భావనతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు చూపించినా, ఏ విచారణకైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.






