రాకాలో భాగమయ్యా.. నా కల నిజమైంది!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకా’. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురిలో జాన్వీ కపూర్, రష్మిక పేర్లు ఇటీవలే తెరపైకి వచ్చాయి.
దీనిపై మూవీ టీమ్ అధికారికంగా స్పందించలేదు. కానీ, తాజాగా ఈ ప్రాజెక్టులో మలయాళ నటి ఫెమినా జార్జ్ భాగమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. తాను ‘రాకా’లో చేరినట్లు స్వయంగా వెల్లడించింది. “నేను అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్టులో భాగమవుతానని అనుకోలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ సినిమా. నేను ఇటీవల ‘డిస్కో’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే ‘రాకా’ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన నటించిన సినిమాల్లో ‘హ్యాపీ’ నేను చూసిన మొదటి చిత్రం. అప్పట్నుంచే అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యా. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగం కావడం కల నిజమైనట్టుగా ఉంది” అని తెలిపింది ఫెమినా జార్జ్. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు స్వయంగా ఫెమినా చెప్పటంతో ఎప్పటినుంచో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టయ్యింది.






