2 June, 2026 | 2:43 AM

భావోద్వేగాల ఇరుముడి

02-06-2026 12:00 AM

మాస్ మహారాజా రవితేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైన్‌మెంట్‌తోపాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్‌లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్ర యాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిరా, స్వాసిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.