14 March, 2026 | 12:58 AM

మూకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

13-03-2026 10:44 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలములోని మూకమామిడి మధ్యతరహా నీటి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం నూతనంగా నిర్మించిన మూకమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది.

స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పంచాయతీ పరిపాలనకు పాలకవర్గానికి గ్రామపంచాయతీ కార్యాలయం ముఖ్యమని ప్రజల సమస్యలు తీర్చడానికి పంచాయతీ కార్యాలయం ఉపయోగపడాలని, పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తా అని అన్నారు.మూకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని రానున్న కొద్ది నెలలలోనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చడానికి మండలంలోని త్వరలో ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమాన్ని మూకమామిడి పంచాయతీలో నిర్ణయించాలని మండల అధికారులకు సూచించారు. పంచాయితీల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని  తెలిపారు. ముత్యాలంపాడు సర్పంచ్ కల్లూరు కిషోర్, ఎంపీడీవో రామారావు,ఎమ్మార్వో భాగ్యలక్ష్మి మండల అధికారులు మాట్లాడారు.