27 June, 2026 | 2:22 AM

ఒక్కో మహిళ ఖాతాలో 1.5 లక్షలు జమ చేస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటా

27-06-2026 01:40 AM
  1. తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు
  2. మూడేళ్ల పాలనలో రేవంత్ చేసిందంతా మోసమే 
  3. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు, 420 హామీల్లో 20 కూడా నెరవేరలేదు
  4.   12 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టారు
  5. సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపం లాంటివాడు
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

వికారాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోని ప్రతి మహిళ ఖాతాలో రూ.1.5 లక్షలు జమ చేస్తే తా ను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వదని ఎద్దేవా చేశారు. రూ.12 వేల కో ట్ల రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు.

ఆరు గ్యారం టీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శుక్రవా రం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్.. కనీసం లక్షాధికారులను చేయాలన్నారు.

రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం హామీ ప్రకారం నెలకు రూ.2,500 చొప్పున ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు వేస్తే శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో 420 హామీలను ఇచ్చి ఈ మూడేళ్లలో 20 కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మూడేళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టారని చెప్పారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఖరీఫ్, రబీ సమయానికి ఖాతాలో డబ్బు జమ అయ్యేవని, రైతుల బాధలు కేసీఆర్‌కు తెలుసునని ఆయన గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపంలాంటి వారని కేటీఆర్ అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుభరోసా, రూ.4 వేల పెన్షన్, పంటలకు బోనస్ ఇలా ఎన్నో హామీలిచ్చి, ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసింది చారానా.. చెప్పింది రూపాయని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పేదల భూములు గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉద్దండాపూర్ నుంచి కాలువలు తవ్వితే పరిగి, కొడంగల్‌కు గ్రావిటి ద్వారా నీళ్లొచ్చేలా సిద్ధం చేశామని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమీషన్ల డబ్బుల కోసం, కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ముందుకు తెచ్చినట్లు ఆరోపించారు. 

బలహీన వర్గాల కాంట్రాక్టర్లపై కుట్ర

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో బలహీన వర్గాల కాం ట్రాక్టర్లలను తొలగించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులకు 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టి వారిని చదువుకు దూరం చేస్తున్నారని, పేదలు చదువుకోవడం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి రెండేళ్లలో పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అ న్నారు. రాకంచర్లలో భూములున్నాయని, అక్కడ ఇండస్ట్రీలకు ఇవ్వండని పేదల భూములు లాక్కోవద్దని ప్రభుత్వా న్ని కోరారు.

అలా చేస్తే వారి పక్షాన పోరాడుతాం భూము లు కాపాడుతామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ఎగరాల్సింది గులాబీ జెండానే, మళ్లీ సీఎం కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా సర్ ప్రక్రి యపై కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని సూచించారు.

కాంగ్రెస్, బీజేపీ దొంగ ఓట్లను నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తారని, బీఆర్‌ఎస్ నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేష్‌రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందరెడ్డి పాల్గొన్నారు.