18 May, 2026 | 3:56 AM

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే..

18-05-2026 02:13 AM

మంచిర్యాల, మే 17 (విజయక్రాంతి) : ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఎసీపీ ఆర్.ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సీపీ పాల్గొని గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ కాలనీ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గతంలో రాత్రివేళల్లో పోలీసులు పిలిస్తే ప్రజలు దూరంగా వెళ్లిపోయేవారని, ప్రస్తుతం పోలీసుల పిలుపుకు స్పందించి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు పోలీసులతో మాట్లాడడం, వారి విధులను అర్థం చేసుకోవడం మంచి పరిణామమని తెలిపారు.

ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం బలపడితే సమాజంలో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా లేదా పనుల్లో పెట్టుకున్నా వారి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, షీ టీమ్లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు వేధింపులు, హింసకు గురైతే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.

అవసరమైతే షీ టీమ్ సిబ్బందిని పంపించి సహాయం అందిస్తామని చెప్పారు. భయరహిత,ప్రశాంత వాతావరణం కల్పించడం పోలీస్ శాఖ బాధ్యత అన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి యువతను వ్యసనాలకు గురిచేస్తున్నారని,ఇది చట్టవిరుద్ధమైన చర్య అని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, వ్యసనాలకు గురైన వారికి ప్రభుత్వ సహకారంతో మెడికల్ కళాశాలలో ప్రత్యేక డీ-అడిక్షన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అలాంటి వారిని చికిత్స కోసం అక్కడికి పంపిస్తామని పేర్కొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీస్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీఐలు ప్రమోద్ రావు, తదితరులు పాల్గొన్నారు.