22 July, 2026 | 12:28 PM

ఆదర్శనగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

22-07-2026 11:55 AM

భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

తాగునీరు, సీసీ రోడ్లు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రకటన

అచ్చంపేట, జూలై 22 : పట్టణంలోని వివిధ కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేటలోని ఆదర్శనగర్ కాలనీలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రతి కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.