చిందేసిన ఉస్మానియా వర్శిటీ!
తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లో పురుడుపోసుకుంటున్న సమయంలో.. అప్పుడప్పుడే క్యాంపస్‌లో అడుగు పెట్టిన విద్యా కుసుమాలు.. విద్యార్థి నాయకులుగా ఎదిగి.. అక్రమ కేసులకు, నిర్బంధాలను ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రాంతీయ అస్తిత్వ వాదంలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుంచి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక ఉస్మానియా విద్యార్థులది.
మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల అనుభవాల గురించి ప్రత్యేక కథనం.
పదేళ్ల కాలంలో
1969లో మేధావులు, విద్యార్థులు మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ ఆగమైంది. నీళ్లూ, నిధులు, నియామకాలు.. కొందరికే దక్కాయి. ఉద్యమ ద్రోహులే అం దలం ఎక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నిజాం కాలేజీలో చదువుతున్నాను. ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ వస్తే బతుకులు మారతాయి అనుకుంటే.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో ఇప్పటికి ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం లేదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమై నా ఈ పరిస్థితి లేకుండా చూడాలి. పదేళ్ల తెలంగాణలో విద్యార్థులు కోరుకున్నది ఒక్కటే.. ఉచితంగా మెస్, హాస్టల్ సౌకర్యం కల్పించాలి. పీహెచ్‌డీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రతినెల ఫెలోషిప్‌లను విడుదల చేయాలి.
నెల్లి సత్య, ఏఐఎస్‌ఎఫ్, ఓయూ కార్యదర్శి
అక్రమ కేసులు, నిర్బంధాలు
ఉద్యమం పురుడు పోసుకుంటున్న సమయంలో మేం యూనివర్సిటీలోకి అడుగు పెట్టాం. చూస్తుండగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు పూర్త యింది. జీవితాలను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నాం. సొంత రాష్ట్రం లో ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డాం. ఇప్పు డు మా గోస ఎవరికీ పట్టడం లేదు. ఇక నియామకాలన్నది తెలంగాణ నిరుద్యోగులకు అందని ద్రాక్షే అయింది. చివరి దాకా కొట్లాడిన ఉద్యమకారుల సంక్షేమం గురించి ఊసేలేదు. అసలు ఉద్యమ ఆకాంక్షలే పాలకులకు గుర్తులేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో 3,500 మంది జైలుకు వెళ్లాం. తెలంగాణ పోరాటంలో అనేక మంది ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు.. చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
జీవన్ ఏబీవీపీ, రిసెర్చ్ స్కాలర్ ఓయూ
1969 ఉద్యమ స్ఫూర్తితో
తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఆ సమయంలో యూనివర్సిటీలో టీవీఎస్‌లో క్రియాశీలక నాయకుడిగా ఉన్నాను. ఓట్లు, సీట్లు వల్ల తెలంగాణ రాదు.. ఒక్క విద్యార్థుల పోరాటం వల్లే తెలంగాణ వస్తది అని మేం ప్రతి సందర్భంలో చెప్పాం. ప్రజా పోరాటాలు, విద్యార్థి పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మా పోరాట కార్యచరణ కూడా అలాగే కొనసాగింది. అవకాశాదులు అంతా పదవుల కోసం తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోని ముందుకెళ్తే.. విద్యార్థులుగా మేం మాత్రం 1969 ఉద్య మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. మాలాంటి వాళ్ల మీద అనేక నిర్భందాలు, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవారు. ఆ సమయంలో జైలుకు వెళ్లిన కూడా గర్వం గా ఫీల్ అయ్యేవాళ్లం. ఇదొక పోరాట రూపం. విద్యార్థి పోరాటాలను గౌరవించి 2014లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు ఏ మాత్రం నేరవేర్చలేదు. తెలంగాణ వస్తే ఉచిత విద్య, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కాని ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కటి నేరవేరలేదు.
కోట శ్రీనివాస్ (పీహెచ్‌డీ)
ఉస్మానియా విద్యార్థి జేఏసీ వ్యవస్థపక సభ్యుడు
విద్యార్థులదే ప్రధాన భూమిక
అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినది తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ చరిత్ర. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి, వర్తమాన కాలంలో మన కళ్ల ముందు సాగిన మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమానికి అనేక అంశాల్లో తేడాలు ఉన్నాయి. అప్పటి ఉద్యమం ఉపాధి, స్థానికత లాంటి సమస్యల కేంద్రంగా ఉద్యోగుల, విద్యార్థుల భాగస్వామ్యంతో జరిగింది. ఈ ప్రజా ఉద్యమంలో ఓయూ విద్యార్థులదే ప్రధాన భూమిక. అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రజలు బాగా చైతన్యం కలిగిన వాళ్లు. కేసీఆర్ నిరంకుశ పాలనను గద్దెదించారు.
సర్దార్ వినోద్ కుమార్, నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ
- రూప






