22 April, 2026 | 2:49 AM

మా ఎజెండా మోస్తే.. మీ జెండా మోస్తాం

25-08-2024 12:39 AM

కాంగ్రెస్, ఎస్సీకి మెహబూబా బంపర్ ఆఫర్

శ్రీనగర్, ఆగస్టు 24: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్నది.  ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)తో ఎన్నికల పొత్తు పెట్టుకొన్నది. మరోవైపు రాష్ట్రంలోని మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) ఆ కూటమికి తాజాగా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎన్నికల్లో పీడీపీ ఎజెండాను అనుసరిస్తే తాము ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్  కూటమికి మద్దతిస్తామని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.

ఆమె శనివారం పీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కూటమి, సీట్ల పొత్తు అనేవి చాలా భిన్నమైన అంశాలు. ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలు మా ఎజెండాను అంగీకరించి ఎన్నికల ప్రచారంలో స్వీకరిస్తే మొత్తం 90 సీట్లలో ఒక్కచోట కూడా మేం పోటీ చేయం. మొత్తం స్థానాల్లో వారికే మద్దతిస్తాం. ఎందుకంటే కశ్మీర్ సమస్య పరిష్కారమే నాకు అన్నింటికన్నా ముఖ్యం. మేం బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పుడు కూడా మా ఎజెండాను ఆ పార్టీ ఆమోదించింది’ అని వివరించారు.