22 April, 2026 | 4:08 AM

హర్యానా ఎన్నికల తేదీలు మార్చండి

25-08-2024 12:35 AM

ఎన్నికల సంఘానికి బీజేపీ వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. అక్టోబర్ 1వ తేదీన ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించింది. అయితే అక్టోబరఠ్ 1వ తేదీకి ముందు, తర్వాత సెలవు రోజులు ఉన్నాయని హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బదోలీ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను బీజేపీ నేత వరిందర్ గార్గ్ సమర్థించారు.

‘పోలింగ్ తేదీ మార్చాలని కోరటానికి కారణం ఉన్నది. సెప్టెంబర్ 28 (శనివారం) చాలామందికి సెలవు దినం. ఆదివారం సాధారణ సెలవు. అక్టోబర్ 1న పోలింగ్. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు దినం. అక్టోబర్ 3వ తేదీన మహారాజా అగ్రసేన్ జయంతి కూడా సెలవు దినమే. ఈ వరుస సెలవుల వల్ల ప్రజలు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉన్నది. దీంతో పోలింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉన్నది. అందువల్లనే పోలింగ్ తేదీని మార్చాలని కోరాం’ అని వివరించారు. ఈ లేఖపై స్పందించిన కాంగ్రెస్.. బీజేపీ పోలింగ్‌కు ముందే ఓటమిని ఒప్పుకొన్నదని విమర్శించింది.