09-02-2026 12:24:23 AM
మెదక్ ఎంపీ రఘునందన్రావు
జిన్నారం, అమీన్పూర్, ఫిబ్రవరి 8 :గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో అక్రమంగా స్టోన్ క్రషర్లను ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల నోట్లో దుమ్ముకొట్టారని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. శనివారం రాత్రి మాదారంలోని 10వ వార్డు అభ్యర్థి టేక్మాల్ రాజు, 11వ వార్డు చెరుకుల మల్లేశ్, 12వ వార్డు వీరాబాయి రఘుసింగ్, 13వ వార్డు అభ్యర్థి కుతాడి రమేశ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాదారం గ్రామ పరిసరాల్లో పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్ నేత హరీష్రావు బంధువుల పేర్ల మీద ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ బంధువులు నడిపిస్తున్నారని చెప్పారు. స్టోన్ క్రషర్ల వల్ల ప్రజల నోట్లో, కంట్లో దుమ్ముకొడుతున్నారని, వీటి వల్ల ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు.
బువ్వ వండితే కంకర పొడితో కలిసి పోతుందని చెప్పారు. ప్రజల కంట్లో దుమ్ముకొట్టి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. మాదారంలోని నాలుగు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే స్టోన్ క్రషర్లను మూసివేయిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా రఘునందన్రావుకు ఆయా వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.