calender_icon.png 6 February, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజనం తర్వాత స్మోక్ చేస్తే..

14-12-2024 12:00:00 AM

స్టుల్ కోసమో.. ఒత్తిడి నుంచి బయటపడేందుకో.. కారణాలు ఏమైనా ధూమపానం శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గుండె, ఊపిరితిత్తులు, మెదడు లోని కణాలను దెబ్బతీస్తుంది. ఇన్నీ నష్టాలున్నాయని తెలిసినా చాలామంది స్మోకింగ్ మానడం లేదు. అయితే స్మోకింగ్ ఏ సమయంలో చేసినా అది ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ తిన్న వెంటనే తాగడం మరింత ప్రమాదకరం. ఈరోజుల్లో చాలామంది బ్రేక్‌ఫాస్ట్ , లంచ్, డిన్నర్ ఇలా తిన్న తర్వాత సిగరెట్ తాగడం సాధారణంగా మారింది. అయితే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

స్మోకింగ్ అందుకే..

తిన్న తర్వాత సిగరేట్ స్మోకింగ్ వెనుక కొన్ని కారణాలున్నాయి. భోజనం తర్వాత సిగరెట్ తాగితే రుచిగా, ఎక్కువ సంతృప్తిగా ఉంటుందంటున్నారు ధూమపాన ప్రియులు. ఈ కారణంతోనే భోజనం తర్వాత సిగరెట్ కాలుస్తున్నామని చెబుతున్నారు. అలాగే ఫ్రెండ్స్‌తో సిగరేట్ తాగుతూ మాట్లాడటం వల్ల హ్యాపీగా ఉందంటున్నారు. సిగరెట్‌లోని నికోటిన్ ఒత్తిడితోపాటు ఆందోళనను తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇది డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒక హ్యాపీ హార్మోన్. అందుకే తిన్న వెంటనే స్మోకింగ్‌కు అలవాటు పడుతుంటారు. కాసేపు ఆనందం కోసం లైఫ్‌ను రిస్క్ చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

భోజనం తర్వాత తాగితే..

ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అన్నవాహిక, ప్యాంక్రియాస్, మూత్రాశయం, మూత్రపిండాలు, గర్భాశయంతో సహా వివిధ క్యాన్సర్‌లకు సిగరేట్ స్మోకింగ్ ప్రధాన కారణమవుతుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. సిగరేట్ తాగడం వల్ల సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది పిల్లలను కనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ధూమపానం వీలైనంతవరకు తగ్గించాలని చెబుతున్నారు డాక్టర్లు.