calender_icon.png 7 February, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ సూప్స్‌తో ఆరోగ్యం!

14-12-2024 12:00:00 AM

చలికాలం ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే.. చిన్న చిన్న ఫ్లూ సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి.. దగ్గు, జలుబు సమస్యలు తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో గ్రీన్ సూప్స్ బాగా పని చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సి డెంట్స్ సీజనల్ వ్యాధుల నుంచే కాదు.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ముందుటాయి. గ్రీన్ సూప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి. వాటి వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.. 

కొత్తిమీర సూప్

తయారీ విధానం: ఒక గిన్నెలోని నూనె వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర తురుము వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళలో కార్న్‌ఫ్లోర్ బాగా కలిపి, మరుగుతున్న మిశ్రమంలో పోసి మళ్లీ కలపాలి. చివరగా ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి దింపేయాలి. 

లాభాలు

* జ్వరం వచ్చినప్పుడు కొత్తిమీర సూప్ తాగితే చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది. 

* కొత్తిమీరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గించడానికి పనిచేస్తాయి. 

* కొత్తిమీర సూప్‌ను ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. 

* దీన్ని క్రమం తప్పకుండా తాగితే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. 

* కొత్తిమీరలోని ఎసెన్షియల్ ఆయిల్స్ ఒత్తిడిని, తలనొప్పిని తగ్గిస్తాయి. షుగర్‌తో బాధపడేవారికి కొత్తిమీర మంచి ఔషధం. 

* ఈ సూప్ తాగడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ పెంచి.. రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. 

పాలకూర సూప్

తయారీ విధానం: పాలకూర సూప్ చేయడానికి ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలకూర, ఉల్లిపాయలు, అల్లం, టొమాటో తరుగు వాటన్నింటినీ కొద్దిగా నీటిని పోసుకుని ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీరుపోసుకుని వడగట్టుకోవాలి. చివరగా పాన్‌లోకి సూప్ పోసి నల్ల ఉప్పు, నల్ల మిరియాలు వేసి మరిగించాలి. తర్వాత వేడివేడిగా ఉన్న సూప్ తాగేయాలి. 

లాభాలు

* చలికాలంలో నీటిని తక్కువ పరిమాణంలో మాత్రమే తాగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలకూర సూప్ తాగితే, అది నీటి కొరతను భర్తీ చేస్తుంది. ఎందుకంటే పాలకూరలో నీరు ఎక్కువగా               ఉంటుంది. దీనివల్ల శరీరానికి తగినంత హైడ్రేషన్ అందుతుంది. అందుకే పాలకూర సూప్‌ని రోజూ తీసుకోవాలి. 

* పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిత్యం కప్పు పాలకూర సూప్ తాగితే ఐరన్ లోపం తగ్గిపోతుంది. ఈ సూప్ తాగడం వల్ల బలహీనత, అలసట తదితర లక్షణాలు సైతం                          దూరమవుతాయి. 

* విటమిన్ సీ, విటమిన్ ఏ పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

తులసి సూప్

తయారీ విధానం: ఓ గిన్నెలో నీరు పోసి దాంట్లో తులసి ఆకులు.. చిన్నగా తరగిన క్యారెట్, బ్రకోలీ, అల్లం, మిరియాలు, ఉప్పు వేసి ఎనిమిది నిమిషాలు మీడి యం మంటపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడకపెట్టిన కూరగాయలు, మిక్సీలో వేసి బాగా గ్రైడ్ చేసి.. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి ప్రై చేస్తోన్న పాన్‌లో కలపాలి. ఓ చిన్న గిన్నెలో మొక్కజొన్న పిండి వేసి అందులో నీళ్లు పోసి కలిపిన మిశ్రమాన్ని కూడా వేసి మరిగించాలి. ఇప్పుడు సూప్ మందంగా తయారవుతుంది. 

లాభాలు

* తులసి సూప్ చలికాలంలో తాగడం వల్ల ఫిట్‌నెస్, ఆరోగ్యం సొంతమవుతాయి. 

* యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. 

పుదీనా సూప్

తయారీ విధానం: స్టౌపై ఒక గిన్నె పెట్టి దాంట్లో బట్టర్ వేయాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత అందులో పచ్చిబఠానీలు, ఉప్పు, నీళ్లు మిక్స్ చేయాలి. బఠానీలు మెత్తగా ఉడికే వరకూ బాయిల్ చేయాలి. పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ మీద నుంచి కిందికి దింపుకుని, చల్లారనివ్వాలి.

తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో నీళ్ళు, మెత్తగా రుబ్బుకున్న బఠానీ పేస్టు, పుదీనా ఆకులు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. మొత్తం మిశ్రమం ఆరోమా వాసన వచ్చే వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే పుదీనా సూప్ రెడీ. 

లాభాలు

  1. పుదీనాలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరుస్తాయి. 
  2. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో  ఉంచడంలో సహాయపడతాయి. 
  3. ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. 
  4. ఐరన్, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని హిమోగ్లోబిన్‌ని పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.