అనుమతులు లేని వసతిగృహాలు
- ఫీజుల పేరీట అడ్డ గోలుగా దోపిడి
- కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు వసతి గృహాల్లో బాగోతం
- మామూళ్ల మత్తులో అధికారులు
- నిబంధనలను పట్టించుకోని వసతి గృహ యజమానులు
- విద్యార్థి సంఘాల ఫిర్యాదు
కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): విద్యార్థులకు చదువుతో పాటు వసతి గృహాలలో ఉంచితే పగడ్బందీగా చదువుకుంటారని ఊహిస్తున్న తల్లిదండ్రులకు వసతి గృహ నిర్వాహకులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఏడాదికి లక్షల్లో వసతి గృహ ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యాలు వసతులను మాత్రం పట్టించుకోవడం లేదు.
కనీసం వసతిగృహం(Private Hostels) ఏర్పాటు అనుమతులు కూడా తీసుకోకుండా అడ్డగోలుగా ఫీజుల పేరుతో దోపిడి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రం అయిన తర్వాత వసతి గృహాలు పెరిగాయి. విద్యార్థులకు కనీస వసతులు సమకూర్చకుండానే నిబంధనలను వదిలేసి వసతిగృహాలను నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రతి నెల మామూలు తీసుకొని తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వసతి గృహాల నిర్వాణపై గతంలో విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదులు చేసిన మార్పురావడం లేదు. పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, కళాశాలలో చదివే విద్యార్థులకు సైతం వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కల తో డబ్బులను లెక్క చేయకుండా వసతి గృహ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్న డబ్బులను చెల్లిస్తున్నారు.
వసతులు నిల్
వసతి గృహాల్లో విద్యార్థులకు కనీసం ఉండాల్సిన వసతులు సమకూర్చడం లేదు . భోజనాల లో సైతం నాణ్యత పాటించడం లేదు. ఫీజులు తీసుకునే మోజు ఉన్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థి సంఘాల సైతం పలుమార్లు ఫిర్యాదులు చేసిన వసతి గృహాల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉన్నతాధికారులు పర్యవేక్షణ కరవు
వసతి గృహాలను మూడు నెలలకు ఒకసారి పర్యవేక్షించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. నెలసరి మామూళ్ల కు అలవాటు పడి వసతి గృహాలను పర్యవేక్షించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహాలను పర్యవేక్షించి, విద్యార్థులకు వసతులను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.