శోభాయమానం నిమజ్జనం

26-09-2026 | 05:35am

ఉండ్రాళ్లయ్యా.. ఉంటామయ్యా

కైలాసానికి వెళ్లి.. వేగి రావయ్యా!

గల్లీ గల్లీలో తీరొక్క రూపాల్లో కొలువుదీరిన గౌరీతనయుడు బొజ్జగణపయ్య.. గంగ మ్మ ఒడికి చేరాడు! మళ్లొచ్చే ఏడాదికి తిరిగొస్తానంటూ వీడ్కోలు తీసుకున్నాడు!! శుక్రవారం హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం శోభాయమానంగా  సాగింది. తీన్మార్ దరువులు.  ‘గణపతిబప్పా మోరియా’ నినాదాల నడుమ  వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ తీరానికి క్యూ కట్టాయి. ఖైరతాబాద్ బడా గణేశుడు తొమ్మిదిన్నరకు బయలుదేరగా.. అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.

మధ్యాహ్నం ౨.౧౫ గంటలకు భక్తులకు బై బై చెప్తూ చెంతకు చేరాడు. ఆ తర్వాత నలుమూలల నుంచి వరుసగట్టిన విగ్రహాల నిమజ్జనం ఘనంగా కొనసాగింది. హుస్సేన్‌సాగర్ సహా నగరంలోని పలు చెరువుల వద్ద  ప్రభుత్వం ౧౪౧ నిమజ్జన కేంద్రాలు, ౨౭౫ క్రేన్లను  ఏర్పాటు చేసింది.  45వేల మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. 24కు పైగా డ్రోన్లను ఉపయోగిం చారు.  శనివారం ఉదయం వరకూ నిమజ్జనాలు కొనసాగనున్నాయి. కాగా, వేలంలో బాలాపూర్ లడ్డూ రూ. ౩౯ లక్షలు పలికింది.  రిచ్‌మండ్ విల్లా లడ్డూ కోటికిపైగా ధరతో రికార్డు సృష్టించింది.

గంగమ్మ ఒడికి బడా గణేశ్

కనుల పండుగలా శోభాయాత్ర 

ఖైరతాబాద్‌లో ఉదయం 9.30కు ప్రారంభం

మధ్యాహ్నం 2.15 ముగిసిన నిమజ్జనం  

నిమజ్జనం వేడుకలకు అశేష భక్తజనం 

హైదరాబాద్ సిటీబ్యూరో 25 (విజయక్రాంతి): మహా ఘట్టం ముగిసింది. ఖైరతాబాద్ బడా గణపతి(Khairatabad Ganesh) నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆదిదంపతులు కైలాసవాసుడు, పార్వతీదేవీల తనయుడు వినాయకుడి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. తెలంగాణలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఖైరతాబాద్ బడా గణేషుడిని భక్తిప్రపత్తుల మధ్య గంగమ్మ ఒడికి చేర్చారు. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో పూజలందుకున్న 69 అడుగల భారీ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో సురక్షితంగా నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ హోరెత్తిన భక్తుల నినాదాల మధ్య పార్వతీప్రుతుడిని కైలాసగిరికి సాగనంపారు. 

కట్టుదిట్టంగా కదలిక..

ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం(Immersion) కోసం ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం రాత్రి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. ముందుగా మండపం పైకప్పు (షెడ్డు), బ్యారికేడ్లను తొలగించి భారీ విగ్రహాన్ని సంప్రదాయం ప్రకారం కదిలించారు. శుక్రవారం తెల్లవారుజామున బాహుబలి క్రేన్ సహాయంతో మహా ప్రతిమను జాగ్రత్తగా ‘టస్కర్’ పైకి చేర్చారు. సాంకేతిక సరిచూపులు, వెల్డింగ్ పనుల అనంతరం ఉదయం పూజలు పూర్తి చేసి శోభాయాత్రను ప్రారంభించారు. 

భక్తిపారవశ్యంలో ఎన్టీఆర్ మార్గ్

ఖైరతాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌(NTR Marg)కు చేరుకుంది. దారిపొడవునా వేలాదిమంది భక్తులు’గణపతి బప్పా మోరియా’, ’బోలో గణేశ్ మహారాజ్ కి జై’ అంటూ మహాగణపతికి నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేషుడి నిమజ్జనం చేపట్టారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన తుది ప్రక్రియ అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు శాస్త్రోక్తంగా సాగర్ జలాల్లోకి చేర్చారు.

ఈ మహాక్రతువును విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు శోభాయాత్రలో నృత్యాలు చేస్తూ భక్తుల్లో ఉత్సాహం నింపారు. నిమజ్జన ఘట్టం తిలకించేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. భావోద్వేగంతో స్వామివారికి వీడ్కోలు పలికారు.

అడుగడుగునా పోలీస్ నిఘా

హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించారు. నిమజ్జనం ఉత్సవ బందోబస్తు కార్యక్రమంలో అశ్విక దళం అందర్నీ ఆకట్టుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్డీఏ, విద్యుత్ శాఖ, జలమండలి మరియు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు సమన్వయంతో పనిచేశాయి. హుస్సేన్సాగర్ నలువైపులా, ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్లపై లక్షలాది మంది భక్తులు నిలబడి నిమజ్జన దృశ్యాలను వీక్షించగా, కొందరు బోట్లలో వెళ్లి సాగర్ లోపల నుండి ఈ ఘట్టాన్ని తిలకించారు. 

బాలాపూర్ గణేశ్ లడ్డూ భళా!

రికార్డు స్థాయిలో రూ.39  పలికిన ధర 

వేలంలో దక్కించుకున్న సామ ప్రణీత్‌రెడ్డి

గతేడాది రూ.35 లక్షలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో/బాలాపూర్ సెప్టెంబర్ 25(విజయక్రాంతి): భాగ్యనగర వినాయక ఉత్సవాల చరిత్రలో ఓ కొత్త రికార్డు నమోదైంది. బాలాపూర్ గణేషుడి(Balapur Ganesh) లడ్డూ గత ఏడాది ఎక్కువ ధర పలికింది. గురువారం నిర్వహించిన వేలంలో రూ.౩౯లక్షలు పలికి రికార్డు నెలకొల్పింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డిని ఈ సారి ఈ లడ్డూ ప్రసాదం వరించింది. ఈ ఏడాది లడ్డూ కోసం పోటీకి మొత్తం 8 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలం పాట ప్రాంగణం గణపతి బప్పా మోరియా అంటూ హోరెత్తిన నినాదాల మధ్య వేలం ఉత్కంఠగా సాగింది. చివరకు రూ.39లక్షల వద్ద సామ ప్రణీత్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.  గతేడాది ఇక్కడి లడ్డూ రూ.35లక్షల వద్ద లింగాల దశరథ్ గౌడ్ కైవసమైంది. ఈసారి మరో రూ.4లక్షలు పెరిగి చరిత్ర సృష్టించింది.

వేలం వద్ద ఉద్రిక్తత

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం వద్ద రోప్ ఏర్పాటు విషయంలో పోలీసులు, ఉత్సవ కమిటీ మధ్య మాటామాటా పెరిగి గందరగోళానికి దారి తీసింది. రోప్ ఏర్పాటు చేసే తీరుపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కమిటీ సభ్యులు పలుమార్లు పోలీసులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అతిథులు, నిర్వాహకులు సైతం శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు.

లడ్డూ కోసం డల్లాస్ నుంచి

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. లడ్డూ కోసం డల్లాస్ నుంచి హరి అనే వ్యక్తి రావడం అందరినీ ఆశ్చర్చపరిచింది. గతంలో ఇక్కడి లడ్డూ వేలం పాట తీరును 2 నెలలుగా పరిశీలిస్తున్నామన్నారు. గతంలో కూడా ప్రయత్నించి చివరిలోదక్కించుకోలేకపోయామని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డూ అంతేనని కితాబిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకం..

మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ వినాయక ఉత్సవాల్లో గణేషుడి చేతిలోని 21 కిలోల లడ్డూ ప్రసాదానికి తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రాముఖ్యం ఉంది. నవరాత్రులు పూజలందుకున్న ఈ లడ్డూను దక్కించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల్లో నమ్మకం. లడ్డూ పొందిన వారు దానిలో కొంతమేర తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రసాదంగా పంచుతారు. మిగతా పంచి, భాగాన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు, వ్యవసాయ భూముల్లో చల్లుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

రూ. 450 నుంచి రూ. 39 లక్షల వరకు

బాలాపూర్ గణపతి ఉత్సవాలకు 45 ఏళ్ల చరిత్ర ఉంది. 1994లో తొలిసారిగా లడ్డూ వేలం పాట సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తొలిసారి ఇక్కడి లడ్డూను స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి కేవలం రూ.450కే దక్కించుకున్నారు. దాన్ని తన పొలంలో చల్లడం వల్ల ఆ ఏడాది మంచి దిగుబడి రావడంతో 1995, 1998, 2004, 2008లలో కూడా మోహన్‌రెడ్డి పోటీపడి వేలంలో లడ్డూను కైవసం చేసుకున్నారు.

అప్పటివరకు పదిహేనుళ్లుగా స్థానికులకే వేలంలో అవకాశం కల్పించగా, 2009 నుంచి స్థానికేతరులకు కూడా ఛాన్స్ ఇచ్చారు. 2009లో సరిత అనే మహిళ రూ. 5.10లక్షలకు లడ్డూను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. 2020లో కరోనా నిబంధనల కారణంగా అప్పటి సీఎం కేసీఆర్‌కు లడ్డూను అందజేశారు. 2024లో కొలను శంకర్ రెడ్డి రూ. 30.01లక్షలు, 2025లో లింగాల దశరథ్‌గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సారి సామ ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షల రికార్డు ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. 

వేలం నిధులు గ్రామాభివృద్ధికే

గ్రామ ఆనవాయితీ ప్రకారం వేలం ద్వారా సమకూరిన నిధులను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కేవలం ఉత్సవాలకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది. ఈ సొమ్ముతో గ్రామంలో పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, ఆలయాల పునర్నిర్మాణం మరియు నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు.

భక్తిశ్రద్ధలతో నిమజ్జనం 

 ప్రఖ్యాత బాలాపూర్ గణేశుడి నిమజ్జనం ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రశాంతంగా ముగిసింది.  లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్ర పాతబస్తీ, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్ మీదుగా సాగి హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) పరిసరాలకు చేరుకుంది.ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 12 వద్ద అధికారుల పర్యవేక్షణలో, భక్తుల జయజయధ్వానాలు, ’గణపతి బప్పా మోరి యా’ నినాదాల మధ్య బాలాపూర్ బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఉత్సవ కమిటీ సభ్యులు, వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

వేలంలో పోటీదారులు

బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనేందుకు ౮మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్‌నగర్, మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్ కుందాడ శాలిని వీరేందర్ రెడ్డి(చంపాపేట్), కంచర్ల శివ రెడ్డి (హస్తినాపురం), ది సుషీ కో(లండన్) సామ దయానంద్ రెడ్డి అండ్ సామ వరణంద్ రెడ్డి, జీఎన్‌ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి (హస్తినాపురం), పీఎస్కే గ్రూప్ శ్రీకాంత్, ఇబ్రాం ప్రత్యూష్ (బాలాపూర్)లు ఉన్నారు.

మరిన్ని వార్తలు