2 April, 2026 | 3:15 AM

విభజన హామీలు అమలు చేయండి

02-04-2026 12:00 AM
  1. తెలంగాణకు న్యాయం చేయండి
  2. లోకసభలో కేంద్రాన్ని నిలదీసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
  3. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  4. ఖమ్మం, పాలమూరును పట్టించుకోండి 
  5. భద్రాచలం నుంచి ఆంధ్రాలో కలిసిన నాలుగు గ్రామపంచాయతీలను తిరిగి ఇచ్చేయండి

ఖమ్మం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం2014 అమలుపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభలో బుధవారం గళమెత్తారు. విభజన సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంస్థాగత, ఆర్థిక, మౌలిక రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. 

హామీలు కాగితాలకే పరిమితం కాకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఎన్‌ఐటి (ఎన్‌ఐటీ), ఐఐఎం (ఐఐఎం), ఐఐఎస్‌ఇఆర్ (ఐఐఎస్‌ఈఆర్), సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్గా ఉన్నందున దాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రస్తావన

మహబూబ్నగర్, ఖమ్మం వంటి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సెక్షన్ 94(2) కింద రావాల్సిన ఆర్థిక తోడ్పాటు ఇంకా పూర్తిగా అందలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 93 ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా నెరవేరలేదని పేర్కొంటూ దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరారు.

కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్కు అదనంగా 825 మెగావాట్ల సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) కోసం అదనపు నిధులు కేటాయించాలని కోరారు. కొత్తగూడెం మరియు ఆదిలాబాద్/పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని కోరారు.