బతికున్న మహిళను రికార్డుల్లో మృతురాలిగా చూపించిన ఘటన
పింఛన్ కోసం అధికారులను ఆశ్రయించిన నర్సవ్వ
కోనరావుపేట, మార్చి 17 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన మాదాసు నర్సవ్వ అనే వృద్ధ మహిళను ప్రభుత్వ రికార్డుల్లో మృతురాలిగా చూపించడంతో పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నర్సవ్వ భర్త నర్సయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందగా, అప్పటి నుంచి ఆమెకు ఎలాంటి విధవ పింఛన్ గానీ, వృద్ధాప్య పింఛన్ గానీ అందలేదని తెలిపారు. ఇటీవల కంప్యూటర్ రికార్డుల్లో తనను చనిపోయినట్లుగా నమోదు చేయడంతో పింఛన్ నిలిచిపోయిందని ఆమె చెప్పారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నర్సవ్వ వాపోయారు. తాను బ్రతికే ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం మృతురాలిగా చూపించడం వల్ల పింఛన్ రావడం లేదని తెలిపారు.కావున జిల్లా కలెక్టర్ అలాగే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రికార్డులను సరిచేసి తనకు పింఛన్ మంజూరు చేయాలని మాదాసు నర్సవ్వ విజ్ఞప్తి చేశారు.




