6 July, 2026 | 3:49 AM

చినుకులకే చెరువుల్లా రోడ్లు

06-07-2026 02:46 AM

హైదరాబాద్‌పై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రగల్బాలు

ఇదేనా మీరు చేస్తామన్న లండన్, సింగపూర్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): చినుకులకే హైదరాబాద్ రోడ్లు చెరవుల్లా మారుతున్నాయని, ఇదేనా మీరు చేస్తామన్న లండన్, సింగపూర్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను లండన్, సింగపూర్ చేస్తామని గొప్పగా మాట్లాడారు తప్ప ఎటువంటి ఆచరణాత్మక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగరంలో రోడ్లు చెరువులుగా మారి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీల్లో పర్యటించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివిధ పార్కులలో ఓపెన్ జిమ్స్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనే ‘ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా’ అనే ప్రధాని మోదీ ఆలోచన మేరకు, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మానవ వనరులుగా తోడ్పడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హైదరాబాద్‌లో వర్షాకాలపు సవాళ్లు వెక్కిరిస్తున్నాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ, చెట్ల పెంపకం (ట్రీ ప్లాంటేషన్), వర్షపు నీటి కాలువలు, పైప్ లైన్లలో పూడికతీత వంటి పనులు ఎక్కడా జరగడం లేదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో, ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడం (వాటర్ హార్వెస్టింగ్) ఎంతో అవసరమని ప్రజలకు ఆయన సూచించారు.

హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారి అపార్ట్‌మెం ట్‌ల పెరుగుదల వల్ల వేడి విపరీతంగా పెరుగుతోం దని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ సంవత్సరం జూన్ నెలలో దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడాలని, ప్రతి పార్కులో, ప్రతి ఇంట్లో వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ ఏర్పాటు చేసి, వర్షపు నీరు మూసీ నది ద్వారా సముద్రంలో కలవకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.