5 September, 2026 | 6:12 AM

చిన్న స్కూల్.. పెద్ద విజయం

05-09-2026 | 04:35am

333% పెరిగిన విద్యార్థుల నమోదు.. 

ప్రభుత్వ పాఠశాలపై పెరిగిన నమ్మకం, బాధ్యత

ఇది సమిష్టి కృషి: ఉమాదేవి, ప్రధానోపాధ్యాయులు

కూసుమంచి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): విద్యార్థులు లేక బోసిపోయిన పాఠశాల నేడు కళకళలాడుతోంది, 333% రేటుతో విద్యార్థుల నమోదు(Student Enrollment)లో జిల్లాలోనే మేటిగా నిలిచింది. ప్రధానోపాధ్యాయురాలి కృషి, గ్రామస్తుల సహకారం, అధికారుల ప్రోత్సాహంతో ప్రాథమిక పాఠశాల(Primary School) జక్కేపల్లి ఎస్సీ కాలనీ సాధించిన విజయ గాధ ఇది..

ముగ్గురు విద్యార్థులతో 2025-26 విద్యాసరాంతానికి అవసాన దశకు చేరుకుంది. మండలంలోని ఎంపీపీఎస్ జక్కేపల్లి (ఎస్సీ కాలనీ) ఇక మూత పడ్డట్టే అని అందరూ భావించారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి పాఠశాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా పాఠశాలలను నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు..

బడిబాట కార్యక్రమంలో...

తెలంగాణ ప్రభుత్వం వారు బడిబాట కార్యక్రమానికి షెడ్యూల్ నిర్ణయించారు, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు తల్లిదండ్రులను గ్రామస్తులను కలిసి విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి ఈ విషయాన్ని మరింత సీరియస్ గా పరిగణించి. తల్లిదండ్రులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండే సమయాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు, కేవలం నిర్దేశించిన షెడ్యూల్లోనే కాక అంతకుమించి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. తన ప్రయత్నాలు నేడు ప్రతిఫలాలుగా కళ్ళ ముందు నిలుస్తున్నాయి..

 333% పెరిగిన నమోదు..

విద్యార్థుల సంఖ్యను పెంచాలనే కృత నిశ్చయంతో, ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపే తల్లిదండ్రులను పేరుపేరునా కలవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల కల్పిస్తున్న వసతులు,  మధ్యాహ్న భోజనం, నూతన వస్త్రాలు, పాఠ్యపుస్తకాలు, నోటి పుస్తకాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన ఇత్యాది విషయాలను స్పష్టంగా తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లగలిగారు. ఫలితంగా ముగ్గురు విద్యార్థులతో అవసాన దశలో ఉన్న పాఠశాలలో 15 మంది నూతనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. 2026- 27 విద్యా సంవత్సరంలో జిల్లాలోనే మేటిగా నిలిచింది ఈ పాఠశాల

అందుబాటులోకి మరో ఉపాధ్యాయులు  

విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పాఠశాలకు మరో ఉపాధ్యాయుని కేటాయించారు. ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు ఈ విషయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులను నమోదు చేసి, నాణ్యమైన విద్యను అందించడంలో జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్ష పెరిగిపోయింది. 

ఇది సమిష్టి కృషి

మూతపడే దశకు చేరుకున్న జక్కేపల్లి ప్రభుత్వ పాఠశాల తిరిగి పూర్వ యోగం దక్కించుకుంది. అంతేకాదు 333% నమోదు రేటుతో జిల్లాలోనే మేటిగా నిలిచింది. ఇది సమిష్టి కృషి వలన వచ్చిన ఫలితం. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు సౌకర్యాల విషయం తల్లిదండ్రులకు స్పష్టంగా చేరవేయడం, నాణ్యమైన విద్యను అందజేస్తామని భరోసాను కల్పించడం, వీటన్నింటికీ తోడు గ్రామస్తులు యువత నుంచి అందిన సహకారం అధికారులు అందించిన తోడ్పాటు వలననే ఈ ఫలితం సాధ్యమైంది.

 - ఉమాదేవి, ప్రధానోపాధ్యాయులు 

ప్రధానోపాధ్యాయురాలు కృషి అభినందనీయం 

ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి గారు విద్యార్థుల సంఖ్యను పెంచడంలో చాలా శ్రమించారు. వారి కృషి అభినందనీయం. ముగ్గురు విద్యార్థులతో మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను 15 విద్యార్థులకు పెంచి పాఠశాలలను బతికించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రధానోపాధ్యాయులు నిరంతర కృషి చేస్తూ ఉంటారు. మండుటెండలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల సంఖ్యలను పెంచడంలో ఆవిడ పడిన తపన చాలా గొప్పది.

- లక్ష్మయ్య గ్రామ సర్పంచ్

మరిన్ని వార్తలు