బ్రిక్స్‌తో భారత్‌కు ప్రయోజనం
సుంకవల్లి సత్తిరాజు :
వర్తమాన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ(Delhi)లో జరుగనున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం(BRICS Summit) అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా-- ఉక్రెయన్ యుద్ధానికి ఈ సదస్సు పరిష్కారం చూపిస్తుందా? ఇరాన్-- అమెరికాల మధ్య బ్రిక్స్ దేశాలు సంధి కుదిర్చి, హోర్ముజ్‌ను స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు అనుకూలంగా మార్చగలవా? బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్ ఈ సదస్సు ద్వారా డాలర్ ఆధిపత్యానికి గండికొట్టాలని తహతహలాడుతున్న చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలతో భారత్ గళం కలుపుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో పాటు అనేక ఆశలు ప్రపంచ దేశాల ప్రజల్లో అంకురిస్తున్నాయి.
హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రి క్త పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దివాళా తీస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి, పెరిగిన ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలకు చుక్కలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఈ క్లిష్ట సమస్య నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించడానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు అహం అడ్డుపడుతున్నది. ఇప్పుడే భారత్ వేదికగా ఈ సమస్యకు పరిష్కారాన్ని వెదకాల్సిన అవసరం ఉంది. కాగా, గల్వాన్‌లో జరిగిన సంఘర్షణలు భారత్ చైనాల మధ్య తీవ్రమైన విబేధాలకు కారణమయ్యాయి.
పైగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో, భారత ఈశాన్య ప్రాంతాల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరి ఇరుదేశాల సంబంధాలకు పెను విఘాతంలా మారాయి. టిబెట్‌లో చైనా చేపట్టిన భారీ జల విద్యుత్ ప్రాజెక్టు భారత్‌ను ఇబ్బంది పెట్టడానికేనన్న విషయం సుస్పష్టం. సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండియా కు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, చైనా వాణిజ్యానికి భారత్ పెద్ద మార్కెట్‌గా ఉన్నప్పటికీ, భారత్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న వైఖరి ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించలేవన్నది జగమెరిగిన సత్యం.
ఈ కారణంగానే అమెరికా తన డాలర్ వాణిజ్యానికి భారత్‌ను పా వుగా వాడుకుంటున్నది. పాక్ వంటి దేశాలతో సహవాసం చేయడమే కాకుండా, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తున్నది. ఇటీవల ఏర్పడిన ఇస్లామిక్ నాటో కేవలం పాక్ పన్నాగమే. భారత్ చుట్టూ శత్రు దేశాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సు భారత్ వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేయాలి.
అయితే, సభ్య దేశాల మధ్య విభిన్న రంగాల్లో పరస్పర సహకారానికి, అభివృద్ధికి ఏర్పడిన బ్రిక్స్ కూట మి ప్రధాన ఉద్దేశం ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా డాలర్‌కు కళ్లెం వేయడమే. ట్రంప్ సాగిస్తున్న ట్రేడ్ వార్ పట్ల ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నాయి. బ్రిక్స్ పట్ల ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అమెరికా ప్రతీకార సుంకాలతో ఆగ్రహంగా ఉన్న వర్తమాన ప్రపంచ వాణిజ్య పరిణామాల రీత్యా బ్రిక్స్ కూటమి బలోపేతం కావడం ఆవశ్యకమనే ధోరణి నెలకొంది.
ఈ పరిణామాలు ట్రంప్‌కు మింగుడు పడకపోవచ్చు. రష్యా, చైనాలతో సాన్నిహిత్యం వలన, ఇత ర దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వలన భా రత్ తొందరగానే అమెరికా విధిస్తున్న వాణిజ్య ప్రతిబంధకాల నుంచి బయటపడవచ్చునని ఆర్థిక నిపుణుల విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా భారతదేశంతో సఖ్యత తో మెలుగుతూనే వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటున్నది. ఈ నేపథ్యం లో టారిఫ్‌లతోభారత్‌ను బెదిరించాలనుకుని కంకణం కట్టు కున్న ట్రంప్‌కు బ్రిక్స్ దేశాల సదస్సు బలమైన సందేశం అందించాలి.
వ్యాసకర్త: సామాజిక విశ్లేషకుడు, 9704903463