calender_icon.png 19 February, 2026 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఏఐ’లో భారత్, ఫ్రాన్స్ కీలక భాగస్వామ్యం

19-02-2026 02:04:47 AM

  1. సాంకేతికత కోసం అమెరికా, చైనాపై ఆధారపడబోం
  2. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టీకరణ
  3. సొంతంగా వ్యూహాత్మక స్వావలంబన సాధించాలనే లక్ష్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్, ఫ్రాన్స్ కీలక భాగస్వాములుగా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆకాంక్షించా రు. ఏఐ సాంకేతిక కోసం  అమెరికా, చైనా నమూనాలపై పూర్తిగా ఆధారపడకూడదని భారత్, ఫ్రాన్స్ భావిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం సాయంత్రం  ’ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా నిర్వహించిన సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడారు.

సొంతంగా వ్యూహాత్మక స్వావలంబన సాధించాలనే లక్ష్యం ఇరు దేశాలకు ఉందని ఆయన పేర్కొన్నారు.  స్వతంత్రంగా ఏఐ పర్యావరణ వ్యవస్థలను నిర్మించుకోవడానికి కంప్యూటరింగ్ సామర్థ్యాలు, నిపుణుల శిక్షణ, పెట్టుబడి వంటి మూడు అంశాలు అత్యంత కీలకమని మేక్రాన్ వివరించారు. ప్రస్తుతం ఏఐ రేసులో అమెరికా, చైనాల కంటే వెనుకబడి ఉన్నా.. గట్టి పోటీని ఇస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇరు దేశాలు ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, ఉత్పాదకత రంగాల్లో నైతిక ప్రమాణాలతో కూడిన ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డాతో కలిసి ఎయిమ్స్‌లో ’ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్’ను మేక్రాన్ ప్రారంభించారు.

ఈ కేంద్రం ఆరోగ్య రంగంలో ఏఐ పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. అలాగే 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్‌కు రప్పించాలనే లక్ష్యంతో వీసా ప్రక్రియను సరళతరం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.