భారత నంబర్‌వన్ శ్రీజ

24-04-2024 12:52:14 AM

న్యూఢిల్లీ: తెలంగాణయువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో టాప్ ర్యాంక్ దక్కించుకుంది. మంగళవారం ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో శ్రీజ 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. ఈ క్రమంలో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రాను వెనక్కినెట్టిన శ్రీజ జాతీయ స్థాయిలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇక మనికా బాత్రా రెండు స్థానాలు దిగజారి 39వ ర్యాంక్‌లో నిలిచింది. రెండుసార్లు జాతీయ చాంపియన్ అయిన శ్రీజ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టింది.

ఇప్పటికే టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కాగా శ్రీజ 2024 ఏడాదిని మంచి ఈజ్‌తో ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో టెక్సస్ వేదికగా జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ టైటిల్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. అదే నెలలో డబ్ల్యూటీటీ ఫీడర్ బీరట్ సింగిల్స్ టైటిల్ కూడా గెలుచుకుంది. ఇక 2022లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో శరత్ కమల్ 37 ర్యాంకులో నిలిచి.. భారత్ తరపున టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. సాతియాన్ జ్ఞానశేఖరన్ 60, మానవ్ ఠక్కర్ 61వ ర్యాంకులో నిలిచారు.

జాతీయ స్థాయిలో నంబర్‌వన్ ర్యాంక్ దక్కడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తే.. ర్యాంక్ మెరుగవుతుందని ముందే ఊహించా. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌లో సత్తాచాటా. మనికాను దాటి ముందుకు వెళ్లడం ఆనందంగా ఉంది. దక్షిణ భారతం నుంచి ఈ ఘనత సాధించింది నేనే కావడం మరింత ఆనందం. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ కోసం సాధన చేస్తున్నా. విశ్వక్రీడల్లో పతకం నెగ్గాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రస్తుతం నా ఏకైక లక్ష్యం అదే. ఆకుల శ్రీజ