ఆ ఘట్టానికి పట్టం
కోహ్లీ 50వ సెంచరీకి అరుదైన గౌరవం..
మాడ్రిడ్: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో కోహ్లీ సాధించిన 50వ వన్డే సెంచరీని ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డు వేడుకలో ప్రదర్శించారు. కోహ్లీ సాధించిన ఆ సెంచరీని.. ‘లారెస్ ఎపిక్ మూమెంట్స్ ఆఫ్ 2024’గా పేర్కొన్న కమిటీ అతడి ఘనతను ప్రత్యేకంగా ప్రశంసించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వేదికగా సోమవారం రాత్రి లారెస్ స్పోర్ట్స్ అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ ఏడాది లారెస్ స్పోర్ట్స్‌మ్యాన్ అవార్డును సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, స్పోర్ట్స్ ఉమెన్ అవార్డును స్పానిష్ ఫుట్‌బాల్ సంచలనం ఐట్నా బొన్మటి గెలుచుకున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కోహ్లి సెంచరీతో మెరిశాడు. ఇది అతడికి 50వ వన్డే సెంచరీ కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత్ టైటిల్ అందుకోవడంలో విఫలమై అభిమానులను నిరాశపరిచింది. ఇదే ఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ట్రెవిస్ హెడ్ వెనక్కి పరిగెడుతూ అద్బుతంగా అందుకున్నాడు. ఈ సంచలన క్యాచ్ కూడా లారెస్ స్పోర్ట్స్ అవార్డు వేడుకలో చోటు దక్కింది.






