ఆసియా కప్ మనదే

14-09-2026 | 05:45am

లంకపై భారత మహిళల ప్రతీకారం

ఎనిమిదోసారి ట్రోఫీ గెలిచిన భారత్

ఫైనల్లో చెలరేగిన షెఫాలీ, స్మృతి

లంకను తిప్పేసిన శ్రీ చరణి, దీప్తి

భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. శ్రీలంకకు ప్రతీకారం విజయం రుచి చూపించింది. ఊహించినట్టుగానే ఆసియా కప్(Asia Cup) ఫైనల్లో పూర్తి అధిపత్యం కనబరిచి ఎనిమిదోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. షెఫాలీ వర్మ, స్మృతి మంథాన విధ్వంసం సృష్టించిన వేళ వార్ వన్ సైడ్‌గా మారిపోయింది.

దుబాయి, సెప్టెంబర్ 13: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌(India)కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. షెఫాలీ వర్మ(Shefali Verma), స్మృతి మంథాన పోటీపడి బౌండరీలు బాదడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చారు. షెఫాలీ వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మంథాన 35 బంతుల్లో అర్ధ శతకం సాధించింది.

129 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రబోదా విడదీసింది. షెఫాలీ వర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే స్మృతి మంథాన రనౌట్ కావడంతో భారత పరుగుల వేగానికి బ్రేక్ పడింది. ఒక ఫోర్, సిక్స్‌తో రిచా ఘోష్(17) దూకుడు కనబర్చినా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపో యింది.

హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) (14), దీప్తి శర్మ(5) నిరాశపర్చగా.. గునలన్ కమలిని(15 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 183 పరుగులకు చేర్చింది. స్మృతి మంథాన 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59, షెఫాలీ వర్మ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక మహిళల జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ దులాని 4 పరుగులకే వెనుదిరిగింది.

త్వరాత ఆటపట్టు, గుణరత్నే ఆదూకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే భారత్ స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఎప్పటిలానే తెలుగమ్మాయి శ్రీ చరణి తన స్పిన్ మ్యాజిక్ చూపించింది. వరుస వికెట్లతో లంకను దెబ్బకొట్టింది. ఆమెకు తోడు దీప్తి శర్మ కూడా చెలరేగి పోవడంతో శ్రీలంక 111 పరుగులకే కుప్పకూలింది. శ్రీ చరణి 4, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టారు. భారత్ మహిళల జట్టు ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదో సారి.

భారత్ ఇన్నింగ్స్: 183/5 (షెఫాలీ వర్మ 68, స్మృతి మంథాన 59; అయోధ్య 1/33, ఆటపట్టు 1/34)

శ్రీలంక ఇన్నింగ్స్: 111 (ఆటపట్టు 36, గుణరత్నే 20, సిల్వా 22; శ్రీ చరణి 4/20 , దీప్తి శర్మ 3/19)

మరిన్ని వార్తలు