అమెరికా ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం
- పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి
- అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం
- పెట్రోల్, డీజిల్‌ను పొదుపుగా వాడాలి
- జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ
- గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తామని స్పష్టీకరణ
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ
- వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు
ప్యారిస్: పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరిస్తూ అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ ప్రధాని నరేంద్రమోదీ స్వాగతించారు. దీని వల్ల హింస తగ్గి వాణిజ్య మార్గాలు పునరుద్ధరించబడుతాయని మోదీ పేర్కొన్నారు. ప్రాన్స్ ఎనియాన్ లెస్ బైన్స్‌లో 52వ జీ7 దేశాల సదస్సులో మంగళవారం మోదీ ప్రసంగించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, దీని వల్ల కొంతవరకైనా సమస్యను అధిగమించవచ్చని సూచించారు.
జీ7 వేదికపై భారత ప్రయోజనాల గురించి మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, అవసరాలను బలంగా వినిపిస్తామని మోదీ స్పష్టం చేశారు. భారత్‌ను వరుసగా ఎనిమిదో సారి జీ7 సదస్సుకు ఆహ్వానించడం ప్రపంచ భాగస్వాములు భారత్‌పై ఉంచిన అపారమైన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తుందన్నారు.
ట్రంప్‌తో మోదీ కరచాలనం
జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్న వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘనస్వాగతం పలికారు.
మోదీ, ట్రంప్ భేటీ..
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ఏడాది వాషింగ్టన్‌లో జరిగిన కాంపాక్ట్ ఒప్పందం, ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చడం, భారత్‌పై అమెరికా విధించిన టారిప్‌లు, వాణిజ్య ఒప్పందాలు, రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారం, ఇధన వివాదం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. బ్రి టన్ పీఎం కీర్ స్టార్మర్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మమ్మద్ బిన్ జాయెద్,అల్ సహ్యాన్‌లతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.
ట్రంప్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
డొనాల్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు): ఇరాన్తో కుదిరిన ఒప్పందం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా పునరుద్ధరణ అయింది కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే మళ్లీ ఆంక్షలు విధిస్తాం. ఇతర దేశాల అధినేతలు సదస్సులో ప్రసంగించారు.
విదేశీ పర్యటనల్లో రికార్డు
ప్రధాని మోదీ @ 100
న్యూఢిల్లీ, జూన్ 16: విదేశీ పర్యటనల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంచరీ కొట్టారు. 12 ఏళ్లలో ఈ రికార్డును కైవసం చేసుకున్నారు. యూరప్ పర్యటనతో మోదీ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. 2014 జూన్ 15న ఆయన భూటాన్‌లో తొలి పర్యటన చేపట్టారు. 2019లో రెండోసారి అధికారం చేపట్టాక జూన్ 8న మాల్దీవులు తొలి పర్యటన చేపట్టారు. 2024లో అధికారం చేపట్టాక జూన్ 13న ఇటలీలో తొలి పర్యటన చేపట్టారు. 2014లో ఎన్నికయ్యాక 49 పర్యటనలు, రెండోదఫా ఎన్నికయ్యాక 27 పర్యటనలు, మూడో దఫాలో 24 పర్యటనలు పూర్తి చేసుకున్నారు. మోదీ సెంచరీ పర్యటనల పట్ల పలువురు పలువురు అభినందనలు తెలిపారు.






