17 June, 2026 | 3:28 AM

తాగునీటి పేరుతో కర్ణాటక జలదోపిడికి తెర..?

17-06-2026 02:29 AM

ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

అయిజ/అలంపూర్, జూన్ 16: కర్ణాటక ప్రభుత్వం త్రాగునీటి పేరుతో ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలో కొత్త లిఫ్ట్ పథకాన్ని చేపట్టడంపై తెలంగాణ ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్ల బృందం మంగళవారం ఆర్డీఎస్ వద్ద డైవర్షన్ స్కీంను పరిశీలించింది. తెలంగాణకు 17 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా కేవలం 7 టీఎంసీలే అందుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే నీటి కొరతతో ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని, కొత్త లిఫ్ట్ పథకం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి మాట్లాడుతూ...ఆనకట్ట పురాతనంగా ఉండటంతో స్లూయిస్లు, కాలువల్లో లీకేజీల ద్వారా నీరు వృథా అవుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వృథా నీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే తెలంగాణ పరిధిలో  30 టీఏంసిల నీటి నిల్వ కోసం రిజర్వాయర్ నిర్మించాలని అధికారులను కోరినట్లు చెప్పారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జోక్యంతో తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకో వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.