సవాళ్లే అస్త్రాలు
- ఛాలెంజ్‌లతో వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
- అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం
- ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాలకు సైతం సిద్ధమంటున్న నేతలు
- కేవలం మాటలకే పరిమితమవుతున్న సవాళ్లు
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమ లు వంటి అంశాలకు సంబంధించి నేతల మధ్య బహిరంగ సవాళ్లు, వ్యక్తిగత విమర్శలు, రాజీనామా ఛాలెంజ్‌లు ప్రధాన చర్చగా మారు తున్నాయి.
‘మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా ను’, ‘ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి’, ‘ప్రజల ముందే తేల్చుకుందాం’ వంటి సవాళ్లు రాష్ట్రంలో ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. ఎన్నికల హామీ లు, అవినీతి ఆరోపణలు, కేంద్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమం.. వంటి ఏ అంశం తెరపైకి వచ్చినా అది నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. రాజకీయ సవాళ్లు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకవైపు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీలపై రాజకీయ దాడి కొనసాగిస్తుండగా, కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వ హామీలు, పాలనా వైఫల్యాలపై సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని సవా ల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార కాంగ్రె స్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ అగ్ర నాయకుల మధ్య జరుగుతున్న సవాళ్ల సమరం ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి పలు మార్లు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గత పాలనలో జరిగిన అవినీతి, ఆర్థిక వ్యవహారాలపై బహిరంగ చర్చలకు సిద్ధమా అని సవాళ్లు విసిరారు. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు నిరూపితమైతే రాజకీయ పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు.
దీంతోపాటు కేంద్రం నుంచి తెలంగాణకు చేకూరాల్సిన లబ్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని, ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే అని సవాల్ విసురుతు న్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రజల ముందే చర్చకు రావాలని ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం చెప్పినదానికి, చేస్తున్నదానికి మధ్య తేడా ఉందని ఆరోపిస్తూ బహిరంగ చర్చలకు సిద్ధమా అని సవాలు విసురుతున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు రైతాం గం, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాల అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, హామీల అమలుపై వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమా అంటూ తరచూ సవాళ్లు విసురుతున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, కేంద్ర నిధుల వినియోగం, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం తెలంగాణకు ఏమి చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజల ముందే చర్చిద్దామని సవాళ్లు విసురుతున్నారు. గతంలోనూ డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. హెచ్‌సీయూ లో విద్యార్థి రోహిత్ వేముల మరణం వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే దీనిపై రామచందర్‌రావు స్పందిస్తూ భట్టి విక్రమార్క భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ. 25 కోట్ల పరవు నష్టం దావా దాఖలు చేస్తానని సవాల్ చేశా రు. ఈ విధంగా ప్రధాన పార్టీల అగ్రనేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. అయితే ఈ రాజకీయ వేడిలో ప్రజా సమస్యలపై చర్చ వెనుకబడుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
రాజకీయ వ్యూహమే..
సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని పరిశీల కులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టడం తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలను ఒకేసారి రాజకీయంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి తన ప్రసంగా ల్లో బీఆర్‌ఎస్ గత పాలనలో జరిగిన అవినీతి, ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావిస్తూనే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే వాదనను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.
దీంతో రాష్ట్ర రాజకీయ చర్చలు కాంగ్రెస్ చుట్టూనే తిరిగేలా చేసే ప్రయత్నం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య జరుగు తున్న రాజకీయ పోరును అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శిస్తూ, బీజేపీనే ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నాన్ని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా చేస్తున్నట్లు కనబడుతుందంటున్నారు.
ప్రజా సమస్యలు పక్కదారి..
గతంలో రాజకీయ భేదాలు ప్రధానంగా విధానాలు, పాలనా నిర్ణయా లకే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుతం రాజకీయ పోరు వ్యక్తిగత అంశాల చుట్టు తిరుగుతున్నాయి. దీంతో తమ ఆరోపణలపై ప్రజల్లో నమ్మకాన్ని ప్రదర్శించేందుకు రాజీనామాల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అయి తే ఇలాంటి రాజకీయ సవాళ్లు ప్రజల్లో ఆసక్తి రేకెత్తించినప్పటికీ, అసలు సమస్యలపై చర్చను పక్కదారి పట్టించే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత విమర్శలు పెరుగుతున్న కొద్దీ అసలు ప్రజా సమస్యలు చర్చకు దూరమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక అంశాలపై చర్చ జరగాల్సిన సమయం లో నేతల మధ్య మాటల యుద్ధమే ప్రధాన అజెండాగా మారుతోంది. ప్ర జా ప్రయోజనాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు.






