ఆరంభం అదిరింది

14-09-2026 | 05:15am

తొలి టీ20లో భారత్ ఘన విజయం 

రెచ్చిపోయిన అభిషేక్ శర్మ

బౌలింగ్‌లో అదరగొట్టిన అర్షదీప్ 

సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం

టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఇటీవల వరుస వైట్ వాష్‌లతో విమర్శలు ఎదుర్కొన్న భారత్ జూలు విదిలించింది. అఫ్ఘనిస్తాన్‌పై తొలి టీ20లో దుమ్ము రేపింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో అర్షదీప్ అదరగొడితే, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అఫ్ఘనిస్తాన్‌(Afghanistan)తో టీ20 సిరీస్‌లో భారత్(India) శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచి గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బుమ్రా వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇబ్రహీం జడ్రాన్(11)ను అక్షర్ పటేల్ రనౌట్ చేయగా, సెదిఖుల్లా అటల్(13)ను అర్షదీప్‌సింగ్ క్యాచ్ ఔట్ చేశాడు.

గుల్బాదిన్ నైబ్ (2)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలోనే అఫ్ఘాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 41 పరుగులే చేసింది. ఆ వెంటనే డార్విష్ రసూలి(2)ని వరుణ్ చక్రవర్తీ క్లీన్‌బౌల్డ్ చేయడంతో 43 పరుగులకే అఫ్ఘాన్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన తర్వాత దూకుడుగా ఆడింది.

83 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అర్షదీప్ సింగ్ విడదీసాడు. ఒమర్జాయ్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 150 పరుగుల మార్క్‌ను దాటించాడు. ఆఖరి ఓవర్‌ను శివమ్ దూబేతో వేయించడం కొంపముంచింది. దూబే బౌలింగ్‌లో అఫ్ఘాన్ బ్యాటర్లు ఒమర్జాయ్, ముజీబ్ 21 పరుగులు చేశారు. అఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీశారు.

అనంతరం సాధారణ లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. వైభవ్ సూర్యవంశీని కాదని సంజూ శాంసన్(10)కి ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు. మూడో ఓవర్‌లోనే అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో  క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. అభిషేక్ శర్మ చెలరేగాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

భారీ సిక్సర్లతో ఊచకోత కోయడంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా అతను చెలరేగడంతో భారత్ స్కోర్ 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసింది. సెంచరీ దిశగా సాగిన అభిషేక్ శర్మను మహమ్మద్ నబీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. తిలక్ వర్మతో కలిసి అయ్యర్ విజయాన్ని పూర్తి చేశాడు. 

స్కోరు బోర్డు..

అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్: 156/8 (ఒమర్జాయ్ 64, నబీ 33; అర్షదీప్ 3/19, వరుణ్ చక్రవర్తి 1/16, బుమ్రా 1/26)

భారత్ ఇన్నింగ్స్: 157/3 (అభిషేక్ శర్మ 82, ఇషాన్ కిషన్ 42, సంజూ శాంసన్ 10; నబీ 2/28)

మరిన్ని వార్తలు