10 July, 2026 | 3:10 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

10-07-2026 02:38 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం దాసుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సింగ్యతండా, లచ్చతండా గ్రామాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లచ్చతండాకు చెందిన ఇస్లావత్ కరుణ-బిచ్చు దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం సింగ్యతండాకు చెందిన నునావత్ లచ్చిరాం-మమత దంపతుల నూతన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


స్థానిక సర్పంచ్ భూక్యా చందర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, బానోత్ రమేష్, వాంకుడోత్ పుణ్యా, లక్ష్మయ్య, పోశాలు, లకావత్ లాలు, భూక్యా ఈశ్వర్, ఇస్లావత్ గణేష్, శేఖర్, శ్రీకాంత్, సర్దార్, బానోత్ రవి, సర్పంచులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.