జూన్ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలి
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,ఏప్రిల్ 13 (విజయక్రాంతి): జూన్ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసే విధంగా అధికారులు బాధ్యత వహించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని తన నివాసం వద్ద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై బాన్సువాడ నియోజకవర్గ MPౄO లు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సబ్ కలెక్టర్ కిరణ్మయిలతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చూడాలని పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తూ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జూన్ నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా చూసి లబ్ధిదారులచే వెంటనే గృహప్రవేశాలు చేయించాలని తెలిపారు. ఏదైనా సమస్యలచే ఇళ్లు మంజూరు అయి ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే లబ్ధిదారులచే సంప్రదింపులు జరిపి త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






