అనాదిగా బీసీలకు అన్యాయం
బీసీ ప్రజలారా! మనం దశాబ్దాలుగా మోసపోతున్నాం. మనం ఓటు వేసే పార్టీలు (మనువాద లేదా అగ్రకుల పార్టీలు) మనకు అన్యాయం చేస్తున్నాయి. కులగణన జరపకపోవడం, రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, బడ్జెట్లలో కేటాయింపులు లేకపోవడం ద్వారా మన అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, అధికారాలను దెబ్బతీస్తున్నాయి. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. దీని ద్వారానే ఈ పార్టీలకు బుద్ధిచెప్పాలి.
మహిళల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 16న పార్లమెంటులో సవ రణ బిల్లును (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు తక్షణమే 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి. ఇందులో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు 1/3వ వంతు ఉప-రిజర్వేషన్ ఉంటుంది. జనరల్ వర్గంలో కూడా 1/3 వంతు మహిళల రిజర్వేషన్ అమలవుతుం ది. అయితే, ఓబీసీ (బీసీ) మహిళలకు ప్రత్యేక ఉప-రిజర్వేషన్ల ప్రస్తావన ఇందులో లేదు. ఎందుకంటే ఇది హారిజాంటల్ (సమాంతర) రిజర్వేషన్. ఇప్పటికే వర్టికల్ (నిలువు) రిజర్వేషన్ ఉన్న ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు మాత్రమే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది.
చట్టసభల్లో ఓబీసీలకు వర్టికల్ రిజర్వేషన్లు లేనందున, ఓబీసీ మహిళలు ఈ లబ్ధి నుంచి మినహాయించబడతారు. ఈ రిజర్వేషన్లు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచి, సమాజంలో వారికి గౌరవ ప్రదమైన స్థానం కల్పించడంలో నిస్సందేహంగా ముఖ్యమైనది. కానీ, ఓబీసీ మహిళ లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతారని గతంలోనే ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కాన్సీరామ్ వంటి మహా నాయకులు హెచ్చరించారు. ఇది నేడు నిజమవుతోంది.
స్వతంత్ర భారతంలో బీసీల పరిస్థితి:- స్వతంత్ర భారతంలో మనం చూసినట్లయి తే, బీసీలు అనే వాళ్లు మొదటినుంచి కూడా మోసగింపబడుతూనే ఉన్నారు. వంచింపబడుతూనే ఉన్నారు. అణచివేయబడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం, మనుధర్మ శాస్త్ర పుణ్యమాని శూద్రులైనటువంటి బీసీలకు ఆస్తి హక్కు లేకుండా చేసి, అధికారంలో భాగస్వామ్యం లేకుండా చేసి, వారిని సేవకులుగా మార్చివేసి, అణచివేశారు. స్వా తంత్య్రానంతరం కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉన్నది.
ముఖ్యంగా రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) అనే పదాన్ని వాడటం వలన, ఎవరి బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అనేటువంటి నిర్వచనానికి తుది తీర్పు చెప్పడానికి కోర్టులకు 45 సంవత్సరాల కాలం గడిచింది. ఆ ఫైనాలిటీ చేయడా నికి ముందు, కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అనేక రాష్ట్రాల్లో కోర్టులు అడ్డుకొని, కొట్టివేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయ గా, 1972లో బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు కులం కూడా ఒక వర్గం అనేటువంటి వ్యాఖ్యానంతో రిపోర్ట్‌ను సమర్థించింది.
కానీ, ఫైనాలిటీ అనేది ఇంద్రా సహాని (1992) కేసుతో జరిగింది. కేంద్రం లో విద్యలో రిజర్వేషన్లు రావడానికి 60 సం వత్సరాలు పట్టింది. రాజ్యాంగంలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అంటే నిర్వచనం లేదు. బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌ను ఎలా గుర్తించాలో సూచించలేదు. తద్వారా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఎవరనే మీమాం స కొనసాగింది. ఇది ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పటికే మద్రాస్ స్టేట్‌లో 1941లో బ్యాక్‌వర్డ్ క్లాస్ అంటే ఈ లిస్టుకు అటాచ్ చేయబడ్డ కమ్యూనిటీస్ అని చెప్పారు. కానీ, రాజ్యాంగంలో అలాంటి మాటలే వాడలేదు. కాబట్టి దానిపైన కోర్టుల జోక్యం పెరిగి, బీసీలకు అన్యాయం జరిగిం ది. మరి మద్రాస్ స్టేట్ ఇచ్చిన నిర్వచనాన్ని తీసుకొని ఉండుంటే, ఆ రోజే ఈ సమస్య పరిష్కారమయ్యేది.
ఎస్సీలు అంటే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు అని చెప్పి, ఆర్టికల్ 341 కింద ప్రెసిడెంట్ నోటిఫై చేసిన కులా లు అని చెప్పారు. అలాగే షెడ్యూల్ తెగలు అంటే ఆర్టికల్ 342 కింద ప్రెసిడెంట్ నోటిఫై చేసిన తెగలు అని చెప్పారు. అలాగే బీసీలు కూడా ప్రెసిడెంట్ నోటిఫై చేసిన కులాలు లేదా వర్గాలు అని చెప్పి ఉండి ఉంటే, ఆ రోజే సమస్య పరిష్కారమయ్యేది. కానీ, 45 సంవత్సరాలుగా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఎందుకంటే బీసీలను అణచివేయడానికి అగ్రవర్ణాలు పన్నిన కుట్రగా దీన్ని చెప్పక తప్పదు.
కులగణన సమస్య: 1951సెన్సస్ నుంచి ఎస్సీ/ ఎస్టీ తప్ప మిగతా కులాల గణనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల బీసీల జనాభా, వారి వెనుక బాటు (సామాజికం, ఆర్థికం, రాజకీయం, విద్య) ఇప్పటికీ సరిగ్గా తెలియడం లేదు. కులగణన జరిపితేనే నిజమైన అన్యాయాలు బయటపడతాయి. కానీ, పాలకులకు అది ఇష్టం లేదు. ఒకవైపు కులవృత్తులు ధ్వంసమయ్యాయి. మరోవైపు ప్రత్యుమ్నాయ ఉపాధి అవకాశాలు లేవు. ఆర్థికసహాయం, గ్రాంట్లు లేవు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో బీసీలను అణచివేశా రు. కేంద్రప్రభుత్వం 2027 సెన్సస్‌లో కులగణన జరుపుతామని చెబుతున్నది. కానీ, హౌస్ హోల్ సర్వే 2026లో ఓబీసీ కాలమ్ లేకపోవడంతో 2027 సెన్సస్‌లో కులగణనపై తీవ్ర అనుమానం కలుగుతున్నది.
రాజకీయ రంగంలో అన్యాయం: చట్టసభల్లో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. అందుకు అనుకూలంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేసి ఉంటే బాగుండేది. తద్వారా బీసీ మహిళలకు సబ్ కోటా లభించేది. కానీ, అగ్రవర్ణ పాలకులకు మనుసు రావడం లేదు. బీసీలలో చలనం లేదు.
న్యాయస్థానాల జోక్యం 50% పరిమితి: రాజ్యాంగంలో విద్య, ఉద్యోగాలలో 50% పరిమితి విధించాలని ఎక్కడా లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4), 15(5)లో 50% మాటే లేదు. స్థానిక సంస్థల ఆర్టికల్ 243డి, 243 టిలో కూడా లేదు. అయినా కోర్టులు ఎస్సీ/ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి, మిగిలింది బీసీలకు ఇవ్వాలని పరిమితం చేశాయి. 10% ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ విషయానికి వస్తే, అవే న్యాయస్థానాలు 50 శాతం సీలింగ్ దాటినా సమర్థిస్తాయి. బీసీలకొక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయం. ఇది ఈ దేశంలో అమలవుతున్న సామాజిక న్యాయం.
అంబేద్కర్ కృషి ఫలితం: ఎస్సీ/ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు లభించా యి. తర్వాత కాలంలో ఉపప్రణాళికలు, రక్షణ చట్టాలు వచ్చాయి. కానీ, బీసీలకు (దేశంలో మెజారిటీ వర్గం) విద్య, ఉద్యోగాల్లో మాత్రమే 27% రిజర్వేషన్లు లభించాయి. చట్టసభల్లో ఏమీ లేదు. సబ్-ప్లాన్ లేదు, రక్షణ చట్టాలు లేవు, గ్రాంట్లు లేవు, సకాలంలో రావు.
మనువాద పార్టీల ‘తిరుగు బహుమతి’:- ఈడబ్ల్యూఎస్ (10%) రిజర్వేషన్లు (103వ సవరణ), మహిళల రిజర్వేషన్లు (106వ రా జ్యాంగ సవరణ) వంటివి తీసుకొచ్చి బీసీల నడ్డి విరుస్తున్నారు. మనం 42% రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టాలని అడిగితే పెండింగ్‌లో పెట్టేస్తారు. కానీ, ఈ బిల్లులు అడగకుండానే తీసుకొస్తున్నారు. బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు ఉండవు. మనువాద పార్టీలకు ఓటు వేస్తున్నందుకు, వారిని మన భుజాలపై మోస్తున్నందుకు వారుమనకు ఇస్తున్న తిరుగు బహుమతులు ఇవి (రి టర్న్ గిఫ్ట్). ఇప్పటికైనా స్పృహ తెచ్చుకోండి.
బీసీ ప్రజలారా! మనం దశాబ్దాలుగా మోసపోతున్నాం. మనం ఓటు వేసే పార్టీలు (మనువాద లేదా అగ్రకుల పార్టీలు) మనకు అన్యాయం చేస్తున్నాయి. కులగణన జరపకపోవడం, రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, బడ్జెట్ల లో కేటాయింపులు లేకపోవడం ద్వారా మ న అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, అ ధికారాలను దెబ్బతీస్తున్నాయి. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. దీని ద్వారానే ఈ పార్టీలకు బుద్ధిచెప్పాలి. ఐక్యమై పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తే తప్ప మన డిమాం డ్లను (కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్, 50% సీలింగ్ ఎత్తివేత, ఉపప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు) ఈ పార్టీలు అంగీకరించవు. ఇప్పటికైనా బీసీలు ఏకం కావాలి. అన్యాయం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది! రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారమని గుర్తెరగాలి.
విశ్రాంత ఐఏఎస్,
చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్
టీ చిరంజీవులు






