వెనుకబాటుపై డేటా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుబుంబ సర్వే (సీపెక్) వివరాలు వెల్లడయ్యాయి. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న మొత్తం 1,12,36,849 కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలను ప్రభుత్వం పబ్లిన్ డొమైన్‌లో పెట్టింది.
దీంతో రాష్ట్రంలోని అన్ని కులాలవారీగా సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వెనుకబాటుపై తొలిసారిగా డేటా అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే, ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉద్దేశించిన అసలు లక్ష్యాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సాధించలేకపోయిందనే చెప్పాలి. వాస్తవానికి స్థానిక సంస్థలు, విద్య, ఉపాధిరంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేజన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఆ హామీని నెరవేర్చేందుకు సమగ్ర కుటుంబ సర్వేకు పూనుకున్నది. కానీ, ఆ మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయంలో మొదటినుంచీ జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. 65 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న తమిళనాడు ఉదాహరణ, 2021లో వికాస్ కిషన్‌రావు గవాళి కేసులో సుప్రీం ధర్మాసనం వెలువరించిన త్రిపుల్ టెస్ట్ తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోకపోవడంతో మొదటికే మోసం వచ్చింది.
సుప్రీం తీర్పు ప్రకారం మొదటగా డెడి కేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి గ్రామాలవారీగా రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను నిర్ధారించాలి. ఈ డేటా ఆధారంగా అమలు చేసే రిజర్వేషన్లు కోర్టులో నిలబడతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ బీసీ కమిషన్‌కు జీవో 199 ద్వారా డెడికేటెడ్ కమిషన్ హోదా కల్పించింది. బీసీ మేధావులు కోర్టుకు వెళ్లడంతో సర్వేకు మూడు రోజుల ముందు 2024 నవంబర్ 3న హడావుడిగా బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానంపైనా అనేక విమర్శలు వచ్చాయి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేయడమే అందు కు తార్కాణం. అయితే, బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పంపించినా, వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. బీసీ వర్గాల ఒత్తిడి తో రాబోయే జనగణనలో కులగణన కూడా చేస్తామని కేంద్రం చెప్పడం కొంత ఊరట కలిగించింది. భవిష్యత్తులోనైనా వెనుకబడిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు దక్కుతాయేమో చూడాలి.






