16 April, 2026 | 2:09 AM

పేదల విద్యాభివృద్ధిపై నిర్లక్ష్యం

16-04-2026 12:00 AM

మన దేశంలోని ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి వార్షిక బడ్జెట్లో 12 నుంచి 15 శాతం వరకు నిధులను విద్యారంగానికి కేటాయిస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులను చూసి అయినా నాటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రేరణ కలుగలేదు.

సామాజిక అభివృద్ధిలో ఎలాంటి వివక్ష చూపించకుండా పౌరులందరికీ సమానమైన విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతోపాటు, వైద్య అవకాశాలను అందుబాటులోకి తీసుకురావా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. వివిధ  రంగాలలో తీవ్రస్థాయి అసమానతలు కలిగిన మన సమాజంలో పేద ప్రజలకు కనీసం నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలి.

స్వతంత్ర భారతదేశంలో మొదటి నాలుగు దశాబ్దాల కాలం కేంద్రప్రభుత్వం తోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమత మ వార్షిక బడ్జెట్‌లలో విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలు, ఇతర వృత్తి విద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్య సౌకర్యాలను అభివృద్ధి చేసి జిల్లా, తాలూకా మండల స్థాయులకు విస్తరించారు. అయితే, కొన్ని చారిత్రక కారణాల వల్ల ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు తెలంగాణ ప్రాంతం విద్య, వైద్య రంగంలో ఎంతో వెనుకబడిపోయింది.

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి, విస్తరించి మారుమూల గ్రామాలలో, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యసేవలు కల్పిస్తారని  ఉద్యమకారులు, ప్రజలు ఆశించారు. ఉద్యమ కాలంలో ఆది నాయకులు కూడా అదే విధంగా సెలవిచ్చారు.

కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏలికలు స్వంత ప్రాధాన్యతలు అమలు చేశారు. విచ్చలవిడిగా అనుత్పాదక, అప్రయోజనకరమైన కేవలం అవినీతికి అవకాశమిచ్చే ప్రాజెక్టులను అమలు చేసి మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల రాష్ట్రంగా మార్చారు. పేద ప్రజల విద్య, వైద్య, ఇతర మానవాభివృద్ధి రంగాలకు కేటాయింపులు, ప్రాధాన్యతలను తగ్గించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే అవస్థాపన పెట్టుబడుల కేటాయింపుల ఊసే లేదు.

రాష్ట్రంలో పుట్టగొడుగుల వలె అదుపు ఆజ్ఞ లేని ప్రైవేటు విద్యాసంస్థల విస్తరణకు అనుమతులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేసినా నియంత్రించే దిక్కు లేదు. ఇదే క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించకపోవడమే గాక 15 సంవత్సరాలు ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేశారు. విద్యావ్యవస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో ఎలాంటి సమీక్షలు  చేయలేదు.

ఇతర రాష్ట్రాల్లో ౧౨ నుంచి ౧౫ శాతం 

మన దేశంలోని ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి వార్షిక బడ్జెట్లో 12 నుంచి 15 శాతం వరకు నిధులను విద్యారంగానికి కేటాయిస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులను చూసి అయినా నాటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రేరణ కలుగలేదు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేవలం ఆరు శాతం నిధులు కేటాయించి విద్యారంగంలో జీతభత్యాలు చెల్లించింది. అదేవిధంగా వైద్య రంగాన్ని, ఉపాధి, ఉద్యోగ కల్పన రంగాలను నిర్లక్ష్యం చేసింది. విద్య నాణ్యతలో మొత్తం దేశంలోనే తెలంగాణ అథమ స్థానానికి చేరుకున్నది. 

హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, సివిల్ సొసైటీ బాధ్యులు, మేధావు లు, బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు అనేక మౌలిక సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి జరుగుతున్న అన్యా యం, చిన్నచూపు, వివక్షను, దాని పర్యవసానాలను ప్రజా దర్బారులో చర్చకు పెట్టారు. ఈ పరిస్థితులను గమనించిన నాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, విద్య శాఖకు అత్యధిక నిధులు (15 శాతం) కేటాయిస్తామని తమ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.

మేధావులు, విద్యావేత్తలు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు కోరినట్లుగా ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని అధికార పీఠం నుంచి దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ మూడు వార్షిక బడ్జెట్‌లను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్న వార్షిక బడ్జెట్లలో కూడా విద్యారంగానికి నిధుల కేటాయింపులు కేవలం 7 నుంచి 8 శాతం వరకే పరిమితమైపోయింది.

విద్యాభివృద్ధి విస్మరణ 

గత 12 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థ కుదేలైన కారణంగా ప్రభుత్వం నిత్యం చెల్లింపుల సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ ఇతర ప్రాజెక్టులు ప్రారంభిస్తూనే ఉంది. అదే సమయంలో కుదేలైన ప్రభుత్వ విద్యారంగానికి మాత్రం కేటాయింపులు పెంచడం లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం సమాజాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఏ ప్రభుత్వమైనా గుర్తించకపోవడం విచారకరం. వి ద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలను నిరంతరం నిర్లక్ష్యం చేయడం వలన జరిగే దీర్ఘ కాలిక అనర్థాలను పాలకులు ఇప్పటికీ గు ర్తించడం లేదు.

ఈ కారణంగానే తెలంగాణ లో అత్యధిక శాతం యువత గౌరవప్రదమైన ఉన్నతస్థాయి ఉద్యోగాలను పొందలేక పోతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అవకాశాలను ఇతర రాష్ట్రాల యువత అందిపుచ్చు కుంటున్నారనీ ప్రభుత్వ వర్గాలు గుర్తించాలి. నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించకుండా అధికారం కోసం కేవలం ప్రలోభ పెట్టే విధంగా సుస్థిర అభివృద్ధికి ఉపయోగపడని సంక్షేమ పథకాలతో ప్రజలను అభివృ ద్ధి రంగాల నుంచి దారిమళ్లించడమే అవుతుంది. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో పేద ల విద్యకు ప్రాధాన్యత కల్పించాలి.

ప్రొ. కూరపాటి 

వెంకట్‌నారాయణ