15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శ్రీలంకలో నవశకం

24-09-2024 12:00 AM

ఆర్థిక సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయి దివాలా అంచులకు చేరుకున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్టు అనుకూల అనుర కుమార దిసనాయకె బాధ్యతలు చేపట్టారు. సోమవారం కొలంబోలోని రాష్ట్రపతి సచివాలయంలో ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన నాయయమూర్తి జయంతజయసూర్య 56 ఏళ్ల దిసనాయకెతో తొమ్మిదో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించడంతో  కొత్త శకం దిశగా ఆ దేశం అడుగులు వేసినట్లయింది. శనివారం జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ నాయకుడైన దిసనాయకె, తన సమీప ప్రత్యర్థి, ఎస్‌జేబీ నాయకుడు సాజిత్ ప్రేమదాసపై గెలుపొందారు. తొలి లెక్కింపులో అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన 50 శాతం ఓట్లు ప్రధాన అభ్యర్థుల్లో ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో దిసనాయకె విజయం సాధించారు.

కాగా ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రం సింఘె తొలి రౌండ్‌లోనే పోటీనుంచి వైదొలిగారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, అవినీతిని నిర్మూలిస్తారనే ప్రజల ఆకాంక్షల మధ్య దిసనాయకె అధ్యక్ష పీఠం ఎక్కడం గమనార్హం. 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో మార్క్సిస్టు భావాలు కలిగిన దిసనాయకె అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గత పాలకులఅవినీతిపై ఓటర్లకున్న ఆగ్రహానికి నిదర్శనం. గత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన దిసనాయకె ఈ ఎన్నికల్లో మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ ప్రజాదారణ పొందారు.

దశాబ్దాలుగా శ్రీలంక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన రాజపక్సే కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన దిసనాయకె నిరంకుశ సాలనకు స్వస్తి పలకాలని, దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రమాణాలు, జవాబుదారీతనం నెలకొల్పాలని ప్రచారం సందర్భంగా దిసనాయకె పదేపదే పిలుపునిచ్చారు.అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకున్న ఆయన  ప్రజల నమ్మకాన్ని ఎంతమేరకు నిలబెట్టుకుంటారో రాబోయే రోజుల్లో తేలుతుంది. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి దేశాధినేత స్థాయికి ఎదిగిన దిసనాయకె శ్రీలంక రాజకీయాల్లో ఓ పెను సంచలనం.

కొలంబోకు సమీపంలోని తంబుట్టె గ్రామంలో కార్మిక కుటుంబంలో జన్మించిన ఆయన స్థానికంగా పాఠశాల విద్యనభ్యసించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరి విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరుమున ( జేవీపీ)లో చేరి అక్కడే తన రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు.1998లో నాటికి పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం దక్కించుకున్నారు.

2000లో ఎంపీ అయిన దిసనాయకె 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగాను సేవలందించారు. 1987లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే భారత ప్రధాని రాజీవ్ గాంధీతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని దిసనాయకె తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆహ్వానంపై మన దేశంలో దిసనాయకె నాయకత్వంలో ఎన్‌పీపీ బృందం పర్యటన తర్వాత మన దేశం విషయంలో ఆయన పార్టీ వైఖరి మారింది.  

కాగా శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకె ఎన్నిక ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. శ్రీంకతో మన దేశానికి చిరకాలంగా సాంస్కృతిక వారసత్వ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆ దేశం ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొన్నప్పుడు, భారత ప్రభుత్వం ఉదారంగా సాయం అందించి ఆదుకుంది. అభివృద్ధి విషయంలో ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయి. అయితే ఇటీవల కొంత కాలంగా శ్రీలంక చైనాకు చేరువ అవుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  పొరుగుదేశమైనభారత్ పట్ల దిసనాయకె ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో వేచిచూడాలి.