calender_icon.png 1 November, 2024 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారంలో తిట్ల దండకాలు

18-04-2024 02:12:03 AM

l నేతల మధ్య ప్రత్యారోపణలు

l ప్రధాన పార్టీల మధ్య ఫిర్యాదుల జోరు

l రోజురోజుకూ వేడెక్కుతున్న రాజకీయం

l మెదక్ లోక్‌సభ స్థానంలో రసవత్తర పోటీ


మెదక్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల నేతల తిట్ల దండకం హోరె త్తుతుంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకునే విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎంత బాగా తిట్టగలిగితే అంత ప్రజలకు చేరువవచ్చనే ధోరణిలో నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసుకునే వరకు వెళ్లింది. మెదక్ లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతుంది. రాష్టంలోనే ఎక్కడాలేని విధంగా ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులపై పలు పోలీస్‌స్టేషన్లలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు అవుతుండటమే కాకుండా రాజకీయ వివాదాలకు దారి తీస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావుపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశా రు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రఘునందన్‌రావుపై సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల నిబం ధనల ఉల్లంఘన కేసు నమోదైంది. అలాగే ఇటీవల సిద్దిపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సెర్ప్, ఐకేపీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించడం రాష్ట్రస్థాయిలో వివాదానికి దారితీసింది.

ఉద్యోగుల సర్వీ సు రూల్స్‌కు విరుద్ధంగా ఈ రాజకీయ పార్టీల సమావేశంలో పాల్గొన్నందుకుగాను మొత్తం 108 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్సెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ వర్గాలతో పాటు, అధికా ర వర్గాల్లోనూ కలకలం రేపింది. ఈ సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో పాటు రవీందర్‌రెడ్డిపై కూడా సిద్దిపేట పోలీసులు కేసు నమో దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకట్రామిరెడ్డిపై రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వెంకట్రామిరెడ్డి హస్తం ఉందంటూ రఘునందన్‌రావు ఆరోపించడం కలకలం రేపింది. 

తాజాగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రఘునందన్‌రావు శ్రీరాముడు, ప్రధాని మోదీ, తన ఫొటోలతో కూడిన క్యాలెండర్లను ఓటర్లకు పంపిణీ చేశారని ఆరోపిస్తూ పటాన్‌చెరు కాంగ్రెస్ నాయకులు ఇటీవల రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థుల పరస్పర ఫిర్యాదులు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు కావడంతో మెదక్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో మాటల యుద్ధం కొనసాగుతుంది. రాష్టంలో ఏ లోక్‌సభ స్థానంలో లేని విధంగా మెదక్‌లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. నువ్వానేనా అన్నట్లుగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే అభ్యర్థులతో పాటు, ఆయా పార్టీల నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులు, కేసుల నమోదుతో మెదక్ పోరు రాష్ట్రంలోనే సంచలనంగా మారుతోంది.