కాంగ్రెస్‌ను టచ్ చేస్తే బీఆర్‌ఎస్ పునాదులు కదిలిస్తాం

18-04-2024 02:18:22 AM

l అవినీతి డబ్బుతో మా ఎమ్మెల్యేలను కొంటారా?

l మేము తలుచుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు మిగలరు

l మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్


నల్లగొండ, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ను టచ్ చేయాలని చూస్తే బీఆర్‌ఎస్ పునాదులు లేకుం డా చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలతుందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్.. దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.

మేము తలుచుకుంటే బీఆర్‌ఎస్‌లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని అన్నా రు. సీఎంను లిల్లిపుట్ అంటావా? ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రేవంత్‌రెడ్డి అని స్పష్టంచేశారు. దొంగ పాసుపోర్టులు చేయలేదని, విటమిన్ డీ తీసుకొని నీలా దొంగ దీక్షలు చేయలేదని, కవిత జైలుకు పోయినా బుద్ధి రాలేదని  ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్లుల దగ్గరికి తాను వెళ్లాకే రైతులకు రూ.500 అదనంగా దక్కిందని, క్వింటాల్‌కు రూ.2500 చెల్లించి మిల్లర్లు వడ్లు కొంటున్నారని స్పష్టంచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 13 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తినడానికి తిండిలేని జగదీశ్‌రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్‌ది దరిద్రపు పాలన

అవినీతి అక్రమాలు, వేల మంది ఫోన్‌లు ట్యాపింగ్‌లతో దేశంలోనే దరిద్రపు పాలన అందించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, వేణుగోపాల్‌రావు, రాధాకిషన్ రావు, తారకరామారావు.. బంధువులతో పాలన చేసిందని చురకలంటించారు. రావులందరూ జైలుకెళ్తే డబుల్ బెడ్రూంలు చంచల్‌గూడ, చర్లపల్లిలో కట్టాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీకే సరిపోలేదని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఆగస్టులో ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు.  మూసీ ప్రక్షాలనను రూ.50 కోట్లతో చేపడుతున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ విధానాలతోనే ప్రస్తుత కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయని అన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య పాల్గొన్నారు.


జిల్లా దవాఖాన ఆకస్మిక తనిఖీ  

నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మికంగా తని ఖీ చేశారు. దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ లో లిఫ్టు పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో పేషెం ట్లు, వారి బంధువులు పడుతున్న ఇబ్బందు లు గుర్తించిన మంత్రి.. త్వరితగతిన నూతన భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

నల్లగొండలో చికిత్స పొందుతున్న తిప్పర్తి మండలం కొరివేనిగూడెంకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తాటికొండ జనార్దన్‌రెడ్డిని మంత్రి పరామర్శించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమలతను మంత్రి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆర్థికసాయం అందించారు.