29 May, 2026 | 2:38 AM

కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం

29-05-2026 01:56 AM

అక్రమ తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్కు స్కెచ్!

ప్లాన్ భగ్నం చేసి అక్రమ ఆయుధంతో సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన తాడ్వాయి పోలీసులు!

పాత అప్పు ఎగవేసేందుకు కిడ్నాప్కు పథకం రచించిన నిందితులు

పోలీసుల అప్రమత్తతతో భగ్నమైన భారీ నేర కుట్ర 

అక్రమ ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం

జిల్లా ఎస్‌పీ యం రాజేష్ చంద్ర 

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి అప్పు ను ఎగగొట్టేందుకు ప్రయత్నించిన ముఠా ఆగడాలకు పోలీసులు కళ్లెం వేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాజి వాడి గ్రామ శివారులో అంతర్రాష్ట్ర ముఠాను తాడువాయి పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా వివరాల ను వెల్లడించారు.

బుధవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాజీవాడి గ్రామ శివాలయం సమీపంలో కొంతమంది అనుమానితులు ఏదో నేరం చేయుటకు పన్నాగం వేస్తున్నారని  విశ్వసనీయ సమాచారం రాగా వెంటనే తాడ్వాయి ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి కృష్ణాజీవాడి గ్రామ శివాలయం వద్దకు వెళ్ళగా పోలీసు వారిని చూసి పరిపోతున్న వారిని పోలీసువారు  వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు.

కామారెడ్డి కి చెందిన భూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు నిందితులైన నిట్టు నర్సింగా రావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామిలతో గతం నుంచి పరిచయం ఉన్నట్లు తెలిపారు. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి.  భూస శ్రీనివాస్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందని భావించిన నిందితులు, పాత ఆర్థిక బాకీలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టవచ్చని  దురుద్దేశముతో ఆయనను కిడ్నాప్ చేయాలని ముందస్తుగా పథకం రచించారు. కిడ్నాప్ను అమలు చేయడానికి ఒక ప్రాణాంతక ఆయుధం ఉంటే భూస శ్రీనివాస్ ని బయపెట్టి అతని వద్ద ఉన్న పెద్దమొత్తములోని నగదు తీసుకోవచ్చని నిందితులు భావించారు.

మహారాష్ట్రలో అక్రమంగా తుపాకులు లభిస్తాయని వారికి పరిచయం ఉన్న అజయ్ , వైభవ్ అనే వ్యక్తులను సంప్రదిం చారు, వారు నయ్గావ్కు చెందిన మారుతి గోకే అనే వ్యక్తి ద్వారా తుపాకీ కొనుగోలు చేయవచ్చని సూచించారు. దాంతో నిందితులు తాడువాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నర్సింగరావు, ఒడ్డే స్వామి కలిసి 12 మే2026న మహారాష్ట్రకు వెళ్లి  అజయ్, హన్మంత రావ్ గోంగపాలే, వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ సహకారంతో మారుతి ఘోకేను కలుసుకొని తుపాకిని కొనుగోలుకు రూ.30,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా అడ్వాన్స్గా రూ.27,000 నగదు చెల్లించారు. 

ఈ నేపథ్యంలో 27 మే 2026న మారుతి ఘోకే అందజేసిన తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవర్, అజయ్ హన్మంత రావ్ గోంగపాలే కలిసి తీసుకుని కృష్ణాజివాడ గ్రామ సమీపానికి చేరుకుని నిందితులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో  తాడ్వాయి పోలీసులు చాకచక్యముగా  వ్యవహరించి ఈ కిడ్నాప్ ముఠా కుట్రను  భగ్నం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ధనికుడైన బుసా శ్రీనివాస్ను కిడ్నాప్ చేసి అతని కుటుంబ సభ్యుల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించారు.  చిట్యాల చెందిన నిట్టు నర్సింగా రావు  గతములో తాడ్వాయి పోలీస్ స్టేషన్ లోని  హత్యా యత్నం కేసులో నేరస్తుదుగా ఉన్నాడు అని తెలిసినది. మిగతా వారి వివరాలను సేకరిస్తున్నారు తెలిపారు.   

నిందితులపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 77/2026 కింద సెక్షన్ 61(2) బీఎన్‌ఎస్ మరియు 3, 4, 25(1AA) ఆరమ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈ కేసులోని ఆరుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో మరో నిందితుడు అయిన మారుతి ఘోకే , నాయగావ్, మహారాష్ట్ర  పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా  గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.