26 June, 2026 | 1:47 AM

వివాదాల సుడిగుండం..

26-06-2026 12:30 AM

అర్బన్ బ్యాంక్‌లో అంతర్గత వర్గపోరు 

బ్యాంకు మొత్తం వివాదాల మయం

కరీంనగర్, జూన్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తరచూ వివాదాల సుడిగుండంలో తిరుగుతుంది. కోర్టు వివాదాలలో చిక్కుకుంటుంది. దీనికి ప్రధాన కారణం అంతర్గత రాజకీయ వర్గపోరు అని చెప్పవచ్చు. డైరెక్టర్ల అనర్హత వేటు, ఓటర్ల జాబితా వివాదాలు. బ్యాంకులో జరుగుతున్న ప్రధాన వివాదాలలో పాలకవర్గం రద్దు, ప్రత్యేకాధికారి నియామకం లాంటి పరిణామాలతో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా మార్చి 31వ తేదీలోగా బ్యాంకు సర్వసభ్య సమావేశం, ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గం రద్దయినట్లు పరిగణించి, ప్రత్యేక అధికారిని నియమించాలని కోరుతూ మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పర్సన్ ఇన్ చార్జి కమిటీ ప్రత్యేకాధికారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ప్రస్తుత పాలకవర్గ చైర్మన్ కర్ర రాజశేఖర్ సభ్యులతో సమావేశమై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు.

గతంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అప్పటి చైర్మన్ కర్ర రాజశేఖర్ తో సహా 15 మంది మాజీ డైరెక్టర్ల సభ్యత్వాలను రద్దు చేశారు. దీనిని సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఈ రద్దును కొట్టివేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కర్ర ప్యానల్ ఘన విజయం సాధించింది.

బ్యాంక్ కు 2017 తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితాపై కోర్టు స్టేలు పడటం, పిటిషన్లు దాఖలవడం వంటివి నిరంతరం జరుగుతున్నాయి. ఇలా వరుస పరిణామాలతో బ్యాంక్ వివాదంలో చిక్కుకుంటుంది. ఈ వరుస పరిణామాలతో బ్యాంక్ అభివృద్ధి కుంటుపడుతుందని సభ్యులు వాపోతున్నారు. వివాదాలకు పుల్ స్టాప్ పెట్టి బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.