కోహెడలో అంతర్జాతీయ ‘మార్కెట్’
- నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త మైలురాయి
- 239ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో నిర్మాణం
- రూ.2,284 కోట్లు నిధులతో మూడు దశల్లో నిర్మాణం
- ఏర్పాట్లను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
రంగారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ భవిష్యత్తును మార్చబోయే ప్రతిష్ఠాత్మక ’కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్’ నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గతంలో నిలిచిపోయిన ఈ మెగా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పునరుద్ధరించి, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు సంకల్పించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమీక్ష నిర్వహించారు.
మూడు దశల్లో నిర్మాణం.. వచ్చే ఏడాది జనవరికి తొలి దశ పూర్తి..
ఔటర్ రింగ్ రోడ్డు , ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానానికి అనువుగా ఉండేలా కోహెడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. సుమారు 239 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2284 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్ ద్వారా పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు అద్భుతమైన వేదిక లభించనుంది.
ఈ మార్కెట్లో ఆధునిక గిడ్డంగులు, కోల్ స్టోరేజీలు, లాజిస్టిక్స్ పార్కులు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. మూడు దశల్లో చేపట్టే ఈ నిర్మాణంలో భాగంగా తొలి దశ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ రైతు భరోసా, రైతు బీమా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం: ఎంపీ చామల
భౌగోళికంగా ఎంతో అనుకూలమైన ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు కొత్త ఊపునిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు, ఇక్కడి ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఇంటి నుంచే ధరలు తెలుసుకునే సాంకేతికత : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
హైదరాబాద్ నగరానికే మణిహారంగా నిలిచే ఈ మార్కెట్లో అత్యాధునిక సాంకేతికతనుఉపయోగించనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మార్కెట్లోని ధరలు, ఉత్పత్తుల లభ్యత వివరాలను ప్రజలు ఇంటి నుంచే తెలుసుకు నేలా డిజిటల్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల దళారీల వ్యవస్థ తగ్గి, రైతు-వినియోగదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
సీఎం కలల ప్రాజెక్టు..
అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం సీఎం కలల ప్రాజెక్టు అని..గత ప్రభుత్వంలో శంకుస్థాపనకు పరిమితమై నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైతులు, వ్యాపారస్తులు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను గుర్తించి కోహెడ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని గడ్డిఅన్నారం వ్యవసాయ ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ ను ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తాను పాలకవర్గంతో సహకారంతో సీఎంను ఒప్పించి ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణమయ్యేలా తనవంతు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. కోహెడ ఫ్రూ ట్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాం తం భవిష్యత్తు రూపురేఖలు మారుతాయని వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముగిసిన ఏర్పాట్లు : కలెక్టర్ నారాయణరెడ్డి
ముఖ్యమంత్రి శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సభకు హాజరయ్యే రైతులకు, ప్రజాప్రతినిధులకు రవాణా, పా ర్కింగ్, తాగునీరు, రక్షణ చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశామన్నారు.
అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, సమాచార కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ గోపి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






