కమిటీల ఏర్పాటుపై కనిపించని కార్యాచరణ!
- రెండేళ్లుగా కానరాని నిధులు
- ఆగిపోయిన పీహెచ్‌సీ భవనాల నిర్మాణాలు
- స్పందించని పాలకవర్గాలు
మెదక్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): సర్కారు దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సౌకర్యాల కల్పన, మందుల కొనుగోలు, ఇతర సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తారు. వీటి ఆధ్వర్యంలో మూడు నెలలోసారి సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన పనులు, నిధుల వ్యయం, ఇతర అంశాలను చర్చిస్తారు.
అనంతరం నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అయితే మెదక్ జిల్లాలో ఏడాదిగా కమిటీలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లా ఆసుపత్రులకు జడ్పీ చైర్మన్, నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, పీహెచ్సీలకు ఎంపీపీలు చైర్మన్లుగా వ్యవహరిస్తారు.
జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల పదవీ కాలం ముగిసి ఏడు నెలలు కావస్తోంది. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తే సమస్యలను చర్చించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే అవకాశం ఉంటుంది.
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో మాతా శిశు కేంద్రం ఉంది. వీటితో పాటు మెడికల్ కళాశాల ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయలేదు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు జిల్లాలో మూడు ఉన్నాయి.
అరకొర నిధులు..
ప్రభుత్వ ఆసుపత్రులకు సరిపడా నిధులు మంజూరు కావడం లేదని, దీంతో సమస్యల పరిష్కారం కావడం లేదని వైద్యాధికారులు పేర్కొంటు న్నారు. సాధారణంగా సామా జిక ఆసుపత్రులకు ఎమ్మెల్యేలు, జిల్లా ఆసుపత్రికి కలెక్టర్, జడ్పీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. పీహెచ్సీలకు ఏటా జిల్లాలో రూ.లక్ష మంజూరు చేస్తారు. అభివృద్ధి కమిటీ ఆమోదం మేరకు వీటిని వసతుల కల్పనకు వినియోగిస్తారు. అయితే రెండేళ్ళుగా నిధులు మంజూరు కావడం లేదని అధికా రులు చెబుతున్నారు.
అర్ధాంతరంగా ఆగిన భవనాలు...
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అలాగే నూతనంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద 71, జడ్పీ నిధుల ద్వారా 41 పీహెచ్సీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్పటి వరకు 40 భవనాలకు టెండర్లు కూడా కాలేదు. 17 భవనాలు సిద్దమైనా ప్రారంభానికి నోచుకోలేదు.
మిగతా భవనాలు ప్రభుత్వం నుండి బడ్జెట్ మంజూరు కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పీహెచ్సీలలో సరియైన వసతులు లేక రోగులు అవస్థలకు గురవుతున్నారు. పలుచోట్ల విద్యుత్ దీపాలు కూడా సరిగా పని చేయడం లేదు.
నిధులు వస్తే పూర్తి చేస్తాం..
రెండేళ్ళుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు మంజూరు కాలేదు. రకరకాల కారణాలతో కమిటీలను ఏర్పాటు చేయలేదు. కొత్తగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నాం. బడ్జెట్ మంజూరైతే పీహెచ్సీల నిర్మాణాలు పూర్తవుతాయి.
డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్‌వో, మెదక్
జిల్లాలో ఇలా...
జిల్లా ఆసుపత్రి....1
సామాజిక ఆరోగ్య కేంద్రాలు....3
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు....20
బస్తా దవాఖానాలు (ఆర్బన్)....2.






