22 March, 2026 | 1:10 PM

హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి: ట్రంప్

22-03-2026 11:33 AM

వాషింగ్టన్: 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడంలో ఇరాన్ విఫలమైతే, ఆ దేశ విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రూత్ సోషల్(Truth Social)లో చేసిన ఒక పోస్ట్‌లో ట్రంప్ ఇలా అన్నారు. ఇరాన్ గనక 48 గంటల లోపు, ఎటువంటి బెదిరింపులు లేకుండా, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను పూర్తిగా తెరిచి ఇవ్వకపోతే అమెరికా సంయుక్త రాష్ట్రాలు వారి వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి, వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తుందని, ఈ చర్య అతిపెద్ద కేంద్రంతో మొదలవుతుందని పేర్కొన్నారు.

అంతకుముందు ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణలో కాల్పుల విరమణకు వచ్చిన పిలుపులను తిరస్కరిస్తూనే, కీలకమైన నౌకా రవాణా మార్గాన్ని సురక్షితం చేసే బాధ్యతను అమెరికా మిత్రదేశాలు, ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీసుకోవాలని ట్రంప్ కోరారు. అమెరికా ఆ జలసంధిని ఉపయోగించదని, తమకు దాని అవసరం లేదని, ఐరోపాకు, కొరియాకు, జపాన్‌కు, చైనాకు మాత్రం అది అవసరమన్నారు. కాబట్టి వారే ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని ఒక ఉమ్మడి అంతర్జాతీయ బాధ్యతగా అభివర్ణించారు.

జలసంధిని తిరిగి తెరవడాన్ని ట్రంప్ ఒక సాధారణ సైనిక విన్యాసంగా అభివర్ణించారు. అయితే దీనికి సమన్వయం, భారీ స్థాయిలో చర్యలు అవసరమని, ఇది చాలా వరకు సురక్షితమే, కానీ మీకు చాలా సహాయం కావాలి... మీకు నౌకలు కావాలి, భారీ సంఖ్యలో దళాలు కావాలని ఆయన అన్నారు. చర్య తీసుకోవడానికి నాటోకు ఇప్పటివరకు ధైర్యం చాలలేదని కూడా ఆయన వెల్లడించారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి ఇండో-పసిఫిక్ భాగస్వాములు మరింత చురుకైన పాత్ర పోషించాలని వారి సంకోచం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అదే సమయంలో, ఉద్రిక్తతలను తగ్గించాలంటూ అంతర్జాతీయంగా విజ్ఞప్తులు పెరుగుతున్నప్పటికీ, అమెరికా తన సైనిక చర్యను విరమించుకోదని ట్రంప్ స్పష్టం చేశారు. మీరు ప్రత్యర్థి పక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నప్పుడు కాల్పుల విరమణ పాటించరని, తాము అలా చేయాలని అనుకోవడం లేదన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు గణనీయంగా క్షీణించాయని ట్రంప్ పేర్కొంటూ, వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారి వద్ద విమాన విధ్వంసక వ్యవస్థలు లేవు అన్ని స్థాయిలలోని వారి నాయకులందరూ హతమయ్యారని వ్యాఖ్యానించారు. తద్వారా ఈ సైనిక చర్య తన లక్ష్యాలను చేరుకునే దశకు చేరుకుందని ఆయన పరోక్షంగా సూచించారు.