4 August, 2026 | 2:49 AM

ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం

21-05-2024 01:09 AM

హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం

తాత్కాలిక అధ్యక్షుడిగా మోక్బర్ నియామకం

మంగళవారం సంతాపదినంగా ప్రకటించిన భారత్

విదేశాంగమంత్రి అమెరబ్దుల్లాహీ కూడా మృతి

అజర్‌బైజాన్ సరిహద్దుల్లో డ్యామ్ ఓపెనింగ్‌కు వెళ్లిన రైసీ

తిరిగి వస్తుండగా వాతావరణం అనుకూలించక ప్రమాదం

ఉపాధ్యక్షుడు మోక్బర్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు

౫౦ రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న ఇరాన్

రైసీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతల సంతాపం

ఒకరోజు సంతాప దినంగా ప్రకటించిన భారత్

ఆ కసాయిని మేం చంపలేదు: ఇజ్రాయెల్ ప్రకటన

టెహ్రాన్, మే 20: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవటంతో దుర్మరణంపాలయ్యారు. రైసీతోపాటు ఇరాన్ విదేశాంగమంత్రి అమెరబ్దుల్లాహీ మరో ఏడుగురు ఉన్నతస్థాయి అధికారులు కూడా మరణించారు. అజర్‌బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన ఓ డ్యామ్‌ను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైసీ మృతదేహాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సిబ్బంది సోమవారం ఘటనాస్థలం నుంచి వెలికితీశారు.

రైసీ అకాల మరణంతో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు మొహ్మద్ మోక్బర్ నియమితులయ్యారు. మోక్బర్ నియామకానికి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ ఆమోదముద్ర వేశారు. ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైసీ మృతి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చన్న వార్తలు వెలువడ్డాయి. ఈ కథనాలను ఇజ్రాయెల్ ఖండించింది. ‘ఆ కసాయిని మేం చంపలేదు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. రైసీ మృతితో మధ్యప్రాశ్చంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ముడిచమురు ధరలు సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మరణించారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవటంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. అధ్యక్షుడితోపాటు హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఇరాన్ విదేశాంగమంత్రి హొస్సేన్ అమీరబ్దుల్లాహీతోపాటు తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతీ కూడా చనిపోయారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 9 మంది ప్ర యాణిస్తున్నారని, వారంతా మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. అజర్ బైజా న్ సరిహద్దుల్లో రెండు దేశాలు సం యుక్తంగా నిర్మించిన ఓ డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరి గింది.

సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఘ టనా స్థలం నుంచి రైసీతోపాటు అన్ని మృతదేహాలను వెలికి తీశారు. వాతావరణం అను కూలించకపోవటంతోనే హెలికాప్టర్ కూలినట్టు ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రైసీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భాంతి వ్యక్తంచేశారు. రైసీ మరణించినట్టు ధృవీకరణ కాగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ దేశ తొలి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మోక్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. 5 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. జోర్డాన్, సిరియా మూడురోజుల సంతాప దినాలుగా ప్రకటించగా, భారత్ కూడా ఒకరోజు ఆతీయ సంతాప దినంగా ప్రకటించింది. 

దారుణ ప్రమాదం

ఇరాన్, అజర్‌బైజాన్ సంయుక్తంగా ఇరు దేశాల సరిహద్దుల్లో నిర్మించిన డ్యాంను ప్రారంభించేందుకు విదేశాంగమంత్రి, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇత ర అధికారులతో కలిసి ఆదివారం ఇబ్రహీంరైసీ వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మూడు హెలికాప్టర్లలో తిరుగు పయనమయ్యారు. సిబ్బంది ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు గమ్యస్థానం చేరగా, రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అరగంట తర్వాత కనిపించకుండా పోయింది. జోల్పా ప్రాంతం కొండల్లో అదృశ్యమైంది.

దానిని కనిపెట్టేందుకు వెంటనే ప్రయత్నించినప్పటికీ రెండు మీటర్ల దూరం కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకోవటంతో సాధ్యపడకపోవడంతో అధ్యక్షు డి హెలికాప్టర్‌ను కనిపెట్టడంలో ఆల స్యం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఇరాన్ రెడ్‌క్రిసెంట్‌తోపాటు ఆ దేశ సైన్యం కూడా రంగంలో కి దిగి యుద్ధ విమానాల ద్వారా గాలింపు మొదలుపెట్టింది. వాతావరణం అనుకూలించకపోవటంతో గగనతల గాలింపు చర్యలను కొద్దిసేపటికే నిలిపేశారు. రెడ్‌క్రిసెంట్‌తోపాటు ట్రెక్కింగ్ నిపుణులు, సైన్యం ఆ కొండల్లో గాలించటం మొదలుపెట్టారు.

తుర్కియే డ్రోన్లను రంగంలోకి దింపటంతో అ వి భూమిపై మంటల వేడిని గ్రహించి ఒక కొండప్రాంతంలో అనుమానాస్పద ప్రమాదాన్ని గుర్తించాయి. ఆ వెంటనే మరింత తీక్షణంగా గాలించటంతో రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిన కనిపించింది. చాపర్ తోకభాగం మాత్రమే మిగిలింది. అతి కష్టమ్మీద అక్కడికి చేరుకొన్న సిబ్బంది.. అధ్యక్షుడితోపాటు చాపర్‌లో ప్రయాణించిన వారి మృతదేహాలను సమీప పట్టణానికి తరలించారు. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోవటంపై స్థానిక మీడియా పలు అనుమానాలు వ్యక్తంచేసింది. 

దేశాధినేతల సంతాపం

రైసీ మృతిపట్ల గల్ఫ్‌దేశాలతోపాటు ప్ర పంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. రైసీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భాంతి వ్యక్తంచేశారు. ‘అత్యంత విషాదకరం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం నన్ను దిగ్భాంతికి గురిచేసింది. భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషిచేశారు. ఇరాన్ ప్రజలకు, రైసీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలు పుతున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైసీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సం తాపం తెలిపారు.

ఇరాన్‌లో తాజా పరిస్థితిని అమెరికా అధ్యక్ష భవనం అధికారులు బైడెన్‌కు వివరించినట్టు అధ్యక్షుడి ప్రతినిధి ఒక రు తెలిపారు. చైనా, ఈజిప్టు, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాధినేతలు రైసీ మృతికి సంతాపం తెలిపారు. లెబనాన్, సిరియా మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాయి. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మోక్బర్‌కు ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. రైసీ మృతికి సంతాపం తెలిపారు. ఇరాన్‌కు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్ మద్దతుతో కార్యకలపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.

రైసీని మేం చంపలేదు 

ఇరాన్ అధ్యక్షుడి మరణంలో తమ పాత్ర ఏమాత్రం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైసీ మృతివెను ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చన అనుమా నాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ స్పం దించింది. ‘ఆ కసాయిని మేం చంపలేదు. ఈ ప్రమా దంలో మా పాత్ర ఏమీ లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. 

తాత్కాలిక అధ్యక్షుడిగా మోక్బర్

రైసీ మృతికి ఇరాన్ సుప్రీం లీడర్, దేశ మతపెద్ద అయతొల్లా అలీ ఖొమేనీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రజలు సంయమనంతో ఉండాలని, ప్రజా జీవనానికి, ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదని కోరారు. రైసీ మృతిని అధికారులు ధ్రువీకరించిన వెంటనే దేశ మొదటి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మోక్బర్‌ను తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు మరణిస్తే.. ఆ రోజు నుంచి 50 రోజుల్లోపు కొత్త అధక్షుడిని ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించాలి.