4 August, 2026 | 1:48 AM

ఇద్దరిని చంపిన మైనర్‌కి 15 గంటల్లోనే బెయిల్

21-05-2024 01:18 AM

మద్యం మత్తులో కారు నడిపిన మైనర్ బాలుడు

15 గంటల్లోనే బెయిల్ 

కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలు

పూణె, మే 20: అతివేగంతో పోర్షే కారును నడిపి, ఇద్దరి మరణానికి కారణమైన 17 ఏళ్ల మైనర్‌కు అరెస్ట్ అయిన 15 గంటల్లోనే బెయిల్ లభించింది. అంతేకాదు, రోడ్డు ప్రమాదాలపై వ్యాసాలు రాయాలంటూ బెయిల్ ఇవ్వడం గమనార్హం. కాగా, నిందితుడి తండ్రి ప్రముఖ రియల్ వ్యాపారిగా తెలుస్తోంది. పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఈ ఘటన జరిగింది. పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో తన ముందున్న బైక్‌ను ఢీకొట్టాడు.

దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. 12వ తరగతి పాస్ అవ్వడంతో పబ్‌కి వెళ్లి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడని.. మద్యం మత్తులో బండి నడిపాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం సెషన్స్ కోర్టుకు చేరింది. ఇద్దరు అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న మైనర్‌ని.. మేజర్‌గా పరిగణించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ పిటిషన్‌ని రద్దు చేయాలని వాదించారు. కానీ సెషన్స్ కోర్టు ఆ బాలుడికి బెయిల్ మంజూరు చేసింది.