బెంగళూరులో రేవ్ పార్టీ
పలువురు తెలుగు నటీనటులు హాజరు?
భగ్నం చేసిన పోలీసులు.. పలువురి అరెస్టు
జన్మదినోత్సవం ముసుగులో అసాంఘిక చర్యలు
బెంగళూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (విజయక్రాంతి): బెంగళూరులో జన్మదినోత్సవం ముసుగులో నిర్వహించిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకొన్న పోలీ సులు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత దాడిచేశారు. ఈ పార్టీకి వందమందికిపైగా హాజరైనట్టు పోలీసులు తెలిపారు. వారందరినీ అదుపులోకి తీసుకొన్నారు. పార్టీలో పలు రకాల నిషేధిత మాదకద్రవ్యాలు వాడినట్టు గుర్తించారు.
ఫాంహౌస్ నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ నిలిపి ఉంచిన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. వీటిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారిక స్టిక్కర్ ఉన్న కారుకూడా ఉన్నది. రేవ్‌పార్టీ నిర్వహించారని అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదుచేసినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఫాంహౌస్ హైదరాబాద్‌కు చెందిన కాన్‌కార్డ్ సంస్థ యజమాని గోపాల్‌రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
తెలుగు నటులు?
ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ, టీవీ నటులు, టెకీలు కూడా పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. 24 మంది యువతులు ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీని ఏర్పాటుచేసినట్టు గుర్తించారు. ఈ నెల 18 నుంచి ఈ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. పార్టీకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందిని వాసు స్వయంగా బెంగళూరుకు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
ఈ పార్టీలో రోజుకు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈ పార్టీకి సినీనటులు శ్రీకాంత్, హేమ కూడా హాజరైనట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వారిద్దరు ఖండించారు. రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు సంబంధం లేదని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజనాలా? కాపీనా? అనేది పోలీసులు తేలుస్తారని అన్నారు. 2023లోనే ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందని వెల్లడించారు.






