27 July, 2026 | 2:19 AM

నౌకపై దాడి.. ఇద్దరు భారతీయుల గల్లంతు

27-07-2026 01:39 AM

న్యూఢిల్లీ, జూలై 26: ఉక్రెయిన్‌కు చెందిన ఒడెసా పోర్టు దగ్గర భారతీయ నావికులున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి జాడ తెలియడం లేదు. నల్ల సముద్రంలో ఒడెసా ఓడరేవు వద్ద ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ మర్చంట్ అనే నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం స్పందిస్తూ దాడి జరిగిన సమయంలో నౌకలో నలుగురు భారతీయులు ఉన్నట్లు పేర్కొంది.

ఇద్దరు గల్లంతయ్యారని, మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు కీవ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం పేర్కొంది. ఇందుకోసం ఉక్రెయిన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా నలుగురు భారతీయులు ఎవరన్న వివరాలను బహిరంగపర్చలేదు.