13 March, 2026 | 8:12 PM

జక్కాపూర్ ఫంక్షన్ హాల్ ఆదాయంలో అవకతవకలు

13-03-2026 07:07 PM

విచారణ చేపట్టిన డీఎల్‌పీఓ, ఎంపీఓ

సిద్దిపేట రూరల్: జక్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఫంక్షన్ హాల్ ఆదాయ లెక్కల్లో జరిగిన అవకతవకలపై అధికారుల విచారణ జరిగింది. గత నెల 23న ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) చందన నారాయణరావుపేట ఇంచార్జ్ మండల పంచాయితీ అధికారి (ఎంపీఓ) అరుణ గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఫంక్షన్ హాల్ ప్రారంభం నుండి 2025 వరకు మొత్తం 61 ఫంక్షన్లు మాత్రమే జరిగినట్లు గ్రామపంచాయతీ రికార్డుల్లో చూపించారు. అయితే స్థానికులు చూపించిన ఆధారాల ప్రకారం దాదాపు 84 ఫంక్షన్లు జరిగినట్లు బయటపడింది. దీంతో సుమారు 26 ఫంక్షన్లకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో నమోదు చేయలేదని విచారణలో వెల్లడైంది.

ఈ విషయంపై సంబంధిత సిబ్బందిని అధికారులు ప్రశ్నించగా, ఎందుకు నమోదు చేయలేదన్న విషయానికి సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిసింది. ఈ సందర్భంగా డీఎల్‌పీఓ చందన మాట్లాడుతూ ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఫంక్షన్ హాల్ ఆదాయ లెక్కల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.