ఎన్నాళ్లీ ఎదురుచూపులు

26-09-2026 | 05:10am

యువ వికాసం.. అర్జీలకే పరిమితం

జిల్లాలో 35177 మంది దరఖాస్తులు 

నిర్మల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం(Rajiv Yuva Vikasam Scheme) కోసం నిరుద్యోగ యువతి యువకులు ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో అమలు చేసిన ఈ సంక్షేమ పథకం ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ నిరుద్యోగ యువతకు అందకుండా పోవడంపై ఈ పథకం అసలు అమలు అవుతుందా లేదా అన్న ఆందోళన నెలకొంది. యూనిట్ల మంజూరీ కోసం జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ దరఖాస్తులు ప్రస్తుతం అతీగతీ లేకుండా పోయిందని నిరుద్యోగ యువత చెప్తున్నారు. దరఖాస్తుదారులు స్వీకరించడంలో చూపిన శ్రద్ధ పథకం అమలులో చూపడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.దరఖాస్తుదారులు సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ పథకం విషయంలో అధికారులకు కూడా స్పష్టత లేకపోవడంతో ఏమీ చెప్పలేక పోతున్నారు.

ప్రభుత్వం మొదట్లో రాజీవ్ యువ వికాస పథకం గురించి గొప్పగా ప్రచారం చేసింది. నిరుద్యోగ యువతకు లేనిపోని ఆశలు కల్పించింది. 2025 జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత నుంచి ధరఖాస్తులను స్వీకరించింది. మంజూరైన యూనిట్ల మేరకు పత్రాలను అర్హులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. చివరి క్షణంలో రుణాల పంపిణీ వాయిదా పడింది. తాజాగా తిరిగి ప్రభుత్వం ఈ పథకంపై ఆశలు రేపడంతో యువత ఎదురుచూస్తోంది.

జిల్లాలో 35వేల  దరఖాస్తులు..

ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల యువతకు రాయితీపై రుణాలను పంపిణీ చేసేవారు. సామాజిక వర్గాల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీని లబ్దిదారులు పొందేవారు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి ’రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రాయితీ రుణాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది.

ఇందులో భాగంగా జిల్లాలో సుమారు 35వేల మంది ఏడాది కింద దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ ఒక్క దరఖాస్తుకు కూడా రుణం పంపిణీ చేయలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట అన్ని కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగులకు రుణాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలం కావడంతో యువతకు నిరాశే మిగిలింది. దీంతో రాయితీ రుణాల పంపిణీ లక్ష్యంకు ప్రభుత్వం గండికొడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఐదు రకాల యూనిట్లు..

రాజీవ్ యువ వికాస పథకం కింద వివిధ యూనిట్లకు ఇచ్చే సబ్సిడీ రుణ మొత్తాన్ని ఐదు రకాల యూనిట్ల కింద రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. కేవలం రూ.50వేల యూనిట్కు మాత్రమే నూరు శాతం సబ్సిడీతో అందించనున్నట్టు తెలిపింది. ఆపైన అంటే రూ.లక్ష యూనిట్లో రూ.90వేలు ప్రభుత్వం, రూ.10వేల ను రుణంగా, రూ.2 లక్షల యూనిట్లో రూ.1.60 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.40 వేలను బ్యాంకు రుణంగా, రూ.3 లక్షల యూనిట్లో రూ.2.10 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.90వేలను బ్యాంకు రుణంగా, రూ.4లక్షల యూనిట్లో రూ.2.80 లక్షల ను ప్రభుత్వం, మిగతా రూ.1.20 లక్షలను బ్యాంకు రుణంగా అందివ్వాలని నిర్ణయించింది.

దరఖాస్తుదారుల్లో నిరాశ

ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం యూనిట్ల పంపిణీని వాయిదా వేయడంతో ఆయా కేటగిరీల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీయువకులు తీవ్రనిరాశకు లోనవుతున్నారు. తొలుత ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబరు వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.

దీనిలో భాగంగా తొలివిడతలో కేటగిరీ-1లో రూ.50 వేలు, కేటగిరీ-2 లో రూ.లక్ష వరకు ఎంపికైన వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. జిల్లాలో బీసీ అభివృద్ధి శాఖ ద్వారా 17286 బిసి, ఎంబీసీ 504, ఈబీసీ 419 దరఖాస్తులకు 3876 బీసీ, 842 ఈబీసీ లకు యూనిట్లు కేటాయించారు.- ఎస్సీ కార్పొరేషన్ ద్వారా7350 దరఖాస్తులకు 2894 యూనిట్లు కేటాయించారు.- మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 5926 మైనారిటీ, 65 క్రిస్టియన్ దరఖాస్తులకు 1045 మైనార్టీ , 27 క్రిస్టియన్ లకు యూనిట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు