3 June, 2026 | 2:24 AM

మీ అయ్య జాగీరా?

03-06-2026 01:38 AM

తెలంగాణలో పోటీ చేస్తా!

నేనే తిరుగుతా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ 

  1. ఎవ్వరూ రావొద్దు అంటే ఇదేమైనా పాకిస్తానా?
  2. దేశంలో తెలంగాణ అంతర్భాగమే
  3. బీఆర్‌ఎస్ ఏపీకి వస్తే స్వాగతించా
  4. రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి, ఇందిరా గాంధీ మెదక్‌లో పోటీ చేయొచ్చు..
  5. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు!
  6.   2 వేల మందితో పెట్టే సభకు అనుమతినివ్వరా?
  7. గద్దర్ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు?
  8. మీడియా సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి

* అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి..? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. అందుకే నా అడ్రస్ తెలియాలనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్ పెట్టా. ఇదేమైనా పాకిస్తానా? మీరు బెదిరిస్తే భయపడబోం. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. బీఆర్‌ఎస్ ఏపీకి వస్తే స్వాగతించా.

రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి, ఇందిరా గాంధీ మెదక్‌లో పోటీ చేశారుగా. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు! 2 వేల మందితో పెట్టే సభకు అనుమతినివ్వరా? గద్దర్ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు?

 హైదరాబాద్ మీడియా సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): ‘తెలంగాణలో పోటీ చేస్తాం.. నేనే తిరుగుతా’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు గనుక చెబుతున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుందని, మేం ఇక్కడ పోటీ చేస్తామని ప్రకటించారు. అవసరమైతే తెలంగాణలో తానే తిరుగుతానని, ప్రతి సమస్య మీద, అన్యాయంపై మాట్లాడతాన్నా రు. ‘నా తెలంగాణ భారతదేశంలో అంతర్భా గం.

ఇదేమైనా పాకిస్తానా? మీరు బెదిరిస్తే భయపడబోం.’ అని చెప్పారు. ఈ మధ్యన కొందరు తనను హైదరాబాద్‌లో ఎలా అడు గు పెడతావ్.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారని, ‘అసలు మీరెవర య్యా నన్ను బెదిరించడానికి..? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. అందుకే నా అడ్రస్ తెలియాలనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్ పెట్టా’ అని పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో కూర్చొన్నారని, ఎమ్మె ల్యేలయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుం దని చెప్పారు. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందన్నారు.  తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను రెండు వేల మందితో సభ పెట్టుకుంటానంటే దానికి అనుమతినివ్వకుంటే వారిని ఏమనాలని ప్రశ్నించారు.

తెలంగాణలో తనకు అధికారంపైన ప్రేమలేదని, కేవలం మార్పుపైనే ప్రేమ ఉందన్నారు. ‘ఇక్కడేమైనా నేను సీఎంను అవుతానా? ఆంధ్ర లోనే నాకు దిక్కులేదు. ఓ విశ్లేషకుడిపై కేసు లు పెడితే..ఆయనపై ఉన్న గౌరవంతో ఆ కేసులను ఉపసంహరించుకోవాలని నేనే చెప్పా’నన్నారు.

ఆ తర్వాత కూడా ఆయన ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనను తిట్టారని పేర్కొన్నారు. తనకు సమాజంలో గొడవలు రేపే ఇష్టం లేదని, అందుకే ఎన్నోసార్లు తగ్గి ఊరుకున్నానని ఆయన తెలిపా రు. తెలంగాణలో వచ్చే ప్రతి సమస్యకూ ఆంధ్రవాళ్లే కారణమా? ఇక్కడి కాంట్రాక్టర్లు ఏపీలో, అక్కడి కాంట్రాక్టర్లు తెలంగాణలో బాగానే ఉన్నారుగా అని అన్నారు. 

బెదిరింపులు..

తనకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ అని పవ న్ కళ్యాణ్ చెప్పారు. ‘తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహికి మద్దతు ఇచ్చింది తెలంగాణ ప్రజలే.. తనకు ఎన్నో ఏళ్లుగా తెలం గాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం.

తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని నన్ను నేతలు చాలా సార్లు అడిగారు, ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని.. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతా ను?. అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే నాకు  ప్రేమ అని, తెలంగాణ ప్రజలకు ఆం ధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.

తెలంగాణ నలుమూలలు తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్ అడవుల్లో  తిరగలేదు.. నేను తిరిగాను. నాపై ఈ విమర్శల వెనుక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నారని నేను అనుకోవడంలేదు. రాష్ట్రాల మధ్య పెచ్చుమీరుతున్న ప్రాంతీయ వాదంపై కేంద్ర ప్రభు త్వం దృష్టిపెట్టాలి. 2029 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమతో కలిసి వస్తుందో లేదో తెలియదని, జనసేన మాత్రం తెలంగాణలో పోటీ చేస్తుంది. ఇక్కడ నా పార్టీ అభ్యర్థులు గెలిస్తే చాలు’ అని ఆయన అన్నారు.

అప్పుడు వైఎస్‌ఆర్‌కు ఊడిగం చేశారు..

తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, ఉ మ్మడి రాష్ట్రాన్ని విభజించిన తీరుకు మాత్ర మే వ్యతిరేకినన్నారు. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పానన్నా రు. తెలంగాణకు వ్యతిరేకం అని వైఎస్‌ఆర్ చెప్పినా, ఆయనకు నాడు కొందరు తెలంగాణ నాయకులు ఊడిగం చేశారని విమ ర్శించారు. ‘గద్దర్ బతికున్న రోజుల్లో మీరం తా ఎక్కడ ఉన్నారు? గద్దర్ వచ్చి తనకు బండి కొనివ్వాలంటే, రెండు రోజుల్లో కొనిచ్చానని.. గద్దర్ బతికి ఉన్న రోజుల్లో ఆయ నకు మీరు ఏం చేశారు?’ అని  పవన్ కళ్యా ణ్ ప్రశ్నించారు.

ఆ భూమి తెలంగాణ ప్రభుత్వాకిస్తాను... 

తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా ఫర్వాలేదన్నారు. ‘పాలకులు వేరు.. ప్రజలు వేరు.. పాలకులను తిట్టండి.. ప్రజలను కాదన్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారని, అక్కడకి ప్రజలు మన తెలుగు ప్రజల్ని పంపిస్తే మన పరిస్థితి ఏమిటి? నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చెబుతున్నా.. ఒకవేళ తాను కబ్జా చేశానని నిరూపణ అయితే, దానిని స్వాధీనం చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు. 

వాళ్లు తిరుగొచ్చుకాని..

కేసీఆర్ బీఆర్‌ఎస్ పెట్టి.. ఏపీకి వచ్చినప్పుడు స్వాగతించానని, జనసేన మాజీ నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నా స్వాగతించానని పవన్‌కళ్యాణ్ చెప్పారు. అందరూ పంజాబ్, మహారాష్ట్రకు వెళ్లొచ్చు.. జనసేన మాత్రం తెలంగాణలో ఉండకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను చైతన్యవంతులు చేస్తామనే భయం నాయకుల్లో ఉందన్నారు. కేవలం 2వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? విశ్లేషకులు ఇష్టానుసారం మాట్లాడినా మా అభిప్రాయం చెప్పకూడదా? అని ప్రశ్నించారు.

ఉత్తరాదిన పుట్టిన కాంగ్రెస్ పార్టీ, విదేశీ సిద్ధాంతాలతో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ పోటీ చేయొచ్చు.. జనసేన మాత్రం తెలంగాణలో ప్రజల తరపున పోరాటం చేస్తే కాంగ్రెస్ నాయకులకు ఎం దుకు తప్పుగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కీలక నాయకులు రాహుల్, ప్రియాంక గాం ధీ వయనాడ్ నుంచి, ఇందిరా గాంధీ మెదక్, పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేయొచ్చు..కానీ తాము మాత్రం ఇక్కడికి రావొద్దా? అని ప్రశ్నించారు.

పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు కూడా తనను తిట్టడం బాధ కలిగించిందన్నారు. గతంలో వారితో తన ఇంట్లోనే చా లాసార్లు సమావేశమయ్యాన్నారు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మర్రి చెన్నారెడ్డి వల్లే సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిందన్నారు. 

పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..

మంగళవారం హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు జనసేన పార్టీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. సభకు అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టంచేసింది. ఈ అత్యవసర పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలించి, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరంలేదని తెలిపింది.

దీంతో జనసేన సభ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరలయ్యింది. సకల జనుల సంకల్పం, అమరుల త్యాగాల రూపమే మన తెలంగాణ అని ఆయన కొనియాడారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ! అని దాశరథి పలికిన అక్షర సత్యం స్వేచ్చా గీతమై మ్రోగిన రోజు పుష్కరం (12 ఏళ్లు) క్రితం ఇదే రోజు’ అని గుర్తు చేశారు.