గ్రేటర్‌లో నిలిచిన సర్టిఫికెట్ల జారీ
- జనరేట్ కానీ బర్త్ అండ్ డెత్ ధ్రువపత్రాలు
- 48 గంటలు కొనసాగిన సాంకేతిక లోపం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. అధికారులు సర్టిఫికెట్లను ఇష్యూ చేసినా జనరేట్ కావడం లేదంటూ బల్దియా ఐటీ విభాగం చెబుతున్నది. అలాంటిదేమీ లేదని సంబంధిత విభాగం ఉన్నతాధికారులు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం అకడమిక్ ఇయర్ ప్రారంభమై, అడ్మిషన్లు జరుగుతున్న దశలో సర్టిఫికెట్ల జారీకి బ్రేక్ పడడంతో గ్రేటర్ వ్యాప్తం గా విద్యార్థులు 48 గంటలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాంకేతిక లోపం ఎప్పుడు క్లియర్ అవుతుందోనని మీసేవా సెంటర్ల వద్ద దరఖాస్తులతో పడిగాపులు కాస్తున్నారు. సమస్యను జీహెచ్‌ఎంసీ అధికారులు సకాలంలో గుర్తించని కారణంగానే వందలాది మంది దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
రెండ్రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ
గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో రోజూ సుమారు 700 నుంచి 1000 దాకా జనన, మరణ సర్టిఫికెట్ల జారీ అవుతాయి. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ఏఎంఓహెచ్‌ల ద్వారా జారీ అయ్యే ఈ సర్టిఫికెట్లు రెండ్రోజులుగా నిలిచిపోవడంతో 30 సర్కిళ్ల పరిధిలో వేలాది మంది నిరీక్షిస్తున్నారు. సర్టిఫికెట్ల జారీకి జనన, మరణాల విభాగం సంబంధిత ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్) సర్టిఫికెట్లను జారీ చేస్తున్నా కూడా జనరేట్ కావడం లేదు.
ఏఎంఓహెచ్‌లు పదే పదే సర్టిఫికెట్ల జనరేట్‌కు ట్రై చేసి నా కాకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ కారణంగా మీసేవాలోనూ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ సమస్య తలెత్తింది. ఇప్పటికే ఈ సెక్షన్‌లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్టుగా జోరుగా విమర్శలు ఉన్నాయి. దాదాపు 30 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను కూడా రద్దు చేసిన చరిత్ర బల్దియాకు ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సీజీజీ నెట్‌వర్క్‌లో ప్రాబ్లమ్
బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో సమ స్య ఉత్పన్నం అవుతుందనే విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజీజీకి ఆలస్యం గా ఫిర్యాదు చేయడం కారణంగానే సర్టిఫికెట్ల జారీ రెండ్రోజులుగా నిలిచిపోయిన ట్టుగా సమాచారం. ఈ సమస్య బుధవారం మధ్యాహ్నం నుంచే ఉన్నప్పటికీ, అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండడం విశేషం. ఒకానొక దశలో సీజీజీ వాళ్లు కూడా సమస్యను గుర్తించలేకపోయారు. కానీ, ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సమస్యకు పరిష్కారం అయినట్టుగా అధికారులు చెప్పుకొచ్చారు.
సీజీజీ మీసేవా నెట్‌వర్క్‌లో సమస్య కారణంగానే జీహెచ్‌ఎంసీ జనన, మరణ ధ్రువపత్రాల జారీలో సాంకేతిక సమస్య ఉత్పన్నం అయినట్టుగా ఐటీ విభాగం డీఈ నర్సింగ్ తెలి పారు. సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్టుగా మీసేవా కేంద్రాల నుంచి కూడా సమాచా రం అందుతున్నట్టు చెప్పారు. అంతే కాకుం డా ఈ సమస్య మరోసారి రాకుండా ఉండేందుకు నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.






