ఉద్యోగాల భర్తీపై వెనక్కి తగ్గం
- నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు
- స్వార్థ శక్తుల కుట్రలకు బలికావొద్దు
- గ్రూప్ 3 పోస్టుల పెంపుకు లీగల్ అడ్డంకులు
- గ్రూప్ వాయిదాపై త్వరలో నిర్ణయం
- నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్
- విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ నేతలతో భేటీ
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్ట మొచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్ట పరమైన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంమాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం సాయం త్రం ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాం గ్రెస్ రాష్ర్ట అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్, మానవతారా య్, బాల లక్ష్మి, చారకొండ వెంకటేష్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగుల డిమాండ్లు, ఆందోళనల గురించి సీఎం ఆరా తీశారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం చర్చించారు.
1:100పై సుదీర్ఘ చర్చ
గ్రూప్ పరీక్షలో ఒక్కో పోస్టుకు 1: 50 నిష్పత్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్‌పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ వెనక్కి తీసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు.
పన్నెండేండ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 పరీక్షకు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారని, ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్‌సీ పకడ్బందీగా నిర్వహించిందని వివరించారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్‌లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని, అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ మళ్లీ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని సీఎంకు వివరించారు.
గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్‌లో ఉన్న బయోమెట్రిక్ పద్ధతిని ఎందుకు పాటించలేదనే ఏకైక కారణంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే.. ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
పోస్టులు పెంచే వెసులుబాటు వీటికి లేదు
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచటం కూడా నోటిఫికేషన్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచటం సాధ్యమైందని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షల్లో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో సీరియస్‌గా కసరత్తు చేస్తుంటే, కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొంటున్నారని మండిపడ్డారు. వారి కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం అన్నారు.
గ్రూప్-2 వాయిదాపై త్వరలో నిర్ణయం
గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు వెంటేవెంటనే ఉండటంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీవరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని.. ఆ వెంటనే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేషన్‌కు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.






